ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నారా..? ఈ కేసులో తనకు బెయిల్ వచ్చే మార్గాలు రోజురోజుకు సన్నగిల్లుతుండటంతో..అప్రూవర్ గా మారడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆమె భావించారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా సీబీఐ అరెస్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సీబీఐ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా కవితను అరెస్ట్ చేశారని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసులో కవితకు ఎలాంటి ఊరటనివ్వలేమని జడ్జి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆమెను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కోసం శుక్రవారం కోర్టు ముందుకు కవిత హాజరు కానున్నారు.
కవిత అప్రూవర్ గా మారనని గతంలో తేల్చి చెప్పారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని… తాను బాధితురాలిని తప్ప నిందితురాలిని కాదని ఇటీవల ఈడీ జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె అప్రూవర్ గా మారనుందన్న వార్తలు చర్చనీయాంశం అవుతున్నాయి. కవిత సడెన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే ఈ నిర్ణయానికి వచ్చారా..? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే.. కవిత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా మనీ లాండరింగ్ కేసులో అంత సులువుగా బెయిల్ లభించే అవకాశం ఉండదు.ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్ట్ అయి ఏడాది కాలంగా జైల్లోనే మగ్గుతున్నారు.తన భార్య క్యాన్సర్ పేషెంట్ అని..ఈ సమయంలో తాను ఆమె పక్కన ఉండటం అవసరమని కోరినా సిసోడియాకు బెయిల్ నిరాకరించారు. అదే సమయంలో శరత్ చంద్రారెడ్డికి మాత్రం బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నానని బెయిల్ అభ్యర్థించగా వెంటనే మంజూరు చేయడం ఆశ్చర్యపరిచింది.ఇదే కేసుకు సంబంధించి అప్రూవర్లుగా మారిన వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు.దాంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే కవిత తన న్యాయవాదులతో.. అప్రూవర్ గా మారేందుకు తన ముందున్న అవకాశాలను పరిశీలించాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ వస్తోన్న కవిత..ఇప్పుడు అప్రూవర్ గా మారితే ఎలా ఉంటుందనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం ఆమె రాజకీయ భవితవ్యాన్ని మరింత ఇబ్బందులోకి నెడుతుండా..? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం ఆమెను పక్కన పెట్టె యోచనలో ఉందని..కవిత అప్రూవర్ గా మారాలనే నిర్ణయం తీసుకుంటే వారికి ఇదొక అస్త్రంలా మారుతుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.