ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంటభార్య, కుమార్తె కవిత కూడా ఉన్నారు. పార్టీ ఢిల్లీ వ్యవహారాలు చూసే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వెళ్లారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను కేసీఆర్ కోరారు . చాలా కాలంగా పీఎంవో స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. అపాయింట్మెంట్పై ఇంకా ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. సమయం ఇస్తే ప్రధానితో భేటీ కావాలని భావిస్తున్నారు. ఇవ్వకపోయినా ప్రధాని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి టీఆర్ఎస్కు అవకాశం చిక్కుతుంది.
తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదంటూ జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా జంతర్ మంతర్‌లో ఈ నెల 11వ తేదీన నిరసన దీక్షకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. దీన్ని సక్సెస్ చేయడానికి వివిధ పార్టీల నేతలతో, రైతాంగ సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటి వరకూ కేసీఆర్ ఢిల్లీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ కేసీఆర్ ఢిల్లీలో ఉంటే జంతర్ మంతర్ దీక్షలో స్వయంగా కేసీఆర్ కూడా ప్రత్యక్షంగా పాల్గొననున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ ప్రాంతీయ పార్టీల ఐక్యతపై కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. అయితే.. కేసీఆర్ వెళ్లింది వైద్య చికిత్సల కోసమని మరో వర్గం చెబుతోంది. కేసీఆర్ సతీమణికి ఎయిమ్స్‌లో చికిత్స చేయిస్తున్నారు. గతంలో రెండు సార్లు అలాగే పర్యటించి.. టెస్టులు చేయించారు. ఇప్పుడు కూడా అదే పని మీద వెళ్తున్నట్లుగా టీఆర్ఎస్లోని కొన్ని వర్గాలతో పాటు.. విపక్షాలు కూడా చెబుతున్నాయి.