ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మార్పుచేర్పుల కన్నా చాలా మందు నుంచీ తెలంగాణలో మంత్రుల మార్పుపై ప్రచారం ఉంది. కేసీఆర్ ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారని దానికి సంబంధించిన కసరత్తులో భాగంగానే ఎమ్మెల్సీల్ని ఎంపిక చేశారన్న ప్రచారం ఉంది. సంక్రాంతికే కొత్త కేబినెట్ వస్తుందని చెప్పుకున్నారు. కానీ శ్రీరామనవమి వచ్చినా మళ్లీ ఆ ఊసు లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ఏపీలో తన కేబినెట్‌ను మార్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు అక్కడ పార్టీలో అసంతృప్తి అంతా బయటకు వస్తోంది. అది ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకూ పార్టీపై తిరుగులేని పట్టు ఉంది అనుకుంటున్న సమయంలో ఇలాంటి నిరసనలు జరగడం ఇబ్బందికరమే.
కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నారు. అందు వల్ల జగన్ కంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అదే సమయంలో ఆయన పార్టీలోకిఇబ్బడిమబ్బడిగా వచ్చిన ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున పదవుల కోసం చూస్తున్నారు. చాలా మంది నేతలు ప్రత్యేక సమావేశాల ద్వారా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేబినెట్ మార్పు అనే అతి పెద్ద రాజకీయ మార్పునకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. దీని వల్ల లేనిపోని చిక్కులు తెచ్చుకోవడమే అని అలాంటి రాజకీయ పరిస్థితుల ద్వారానే ఎదిగిన కేసీఆర్‌కు తెలియనిదేం కాదు.
అందుకే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గమే.. కేసీఆర్ ఎన్నికల టీం అనుకోవచ్చు. ఎలాగూ ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా ఉంది. కేసీఆర్ ఖండిస్తున్నప్పటికీ.. ఆయన పార్టీ ఉగాది పంచాంగంలో ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. దీంతో ఇక కేసీఆర్ ఇప్పుడున్న మంత్రుల టీంతోనే ఎన్నిలకు వెళ్తారని… మంత్రివర్గ మార్పు అనే అంశాల జోలికి వెళ్లరని భావిస్తున్నారు.