తమిళనాడు సీఎం స్టాలిన్ అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక అభిమానం. పలు మార్లు మాటలతో ఈ అభిమానం వ్యక్తమయింది. స్టాలిన్‌కు కూడా అభిమానమే. ఆయన స్వయంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి రావడమే దీనికి నిదర్శనం. అయితే స్టాలిన్‌ను మాత్రం ఈ మిత్రోం ముఖ్యమంత్రులు గౌరవిస్తున్నారో లేదో స్పష్టత లేదు. దక్షిణాది సమస్యలపై కేంద్రంపై పోరాడదామని గతంలో ఓ సారి లేఖ రాస్తే స్పందన లేదు. ఇప్పుడు మరోసారి స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని.. కలసి పోరాటం చేద్దాం రావాలని పిలుపునిచ్చారు.
స్టాలిన్ మొత్తం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖలు రాశారు. జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలం రాష్ట్రాల హక్కులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం వైఖరి స్టాలిన్‌కు నచ్చడం లేదు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన లేఖలో పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇలా లేఖ రాయడానికి ప్రధానంగా నీట్‌ను కారణంగా చెప్పుకోవచ్చు.
మెడికల్ ఎంట్రన్స్ కోసం దేశవ్యాప్తంగా నీట్ ను ప్రవేశ పెట్టారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు. మరి మిత్రుడు స్టాలిన్ పంపిన లేఖకు కనీసం ప్రత్యుత్తరం అయినా మిత్రులు ఇస్తారో లేదోచూడాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రంపై పోరాడేందుకు ఇప్పటి వరకూ రెండు ప్రభుత్వాలూ ముందుకు రాలేదు మరి. !