మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆ మధ్య ఈసారి అసెంబ్లీకి హాజరై గర్జిస్తానని ప్రకటించిన కేసీఆర్ మనసు మార్చుకున్నారా..? ప్రకటించినట్లుగానే అధికార పక్షానికి చుక్కలు చూపిస్తారా..? అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ఇప్పటివరకు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోంది. కానీ, కేసీఆర్ హాజరు కావాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు, ఆరు గ్యారంటీల విషయంలో సర్కార్ పై సభలో సమరమేనని ప్రకటించిన కేటీఆర్ , హరీష్… సభలో వారికి కేసీఆర్ తోడైతే కాంగ్రెస్ కు కొంత ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది.
Also Read : కవితను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఇదిలా ఉండగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్ హౌజ్ కే పరిమితమైతే వారంతా మరో ఆలోచన కూడా లేకుండా కాంగ్రెస్ లో చేరడం ఖాయం. కాంగ్రెస్ లో చేరికపై ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంత కన్ఫ్యూజ్ చేసేందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. లేదంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యమని అంచనా వేస్తున్నారు. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే అది బీఆర్ఎస్ కే నష్టమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ వర్గాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. కానీ, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.