మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ ధాకరేను ఎమ్మెల్యేలు పూర్తిగా విడిచి పెట్టేయడం.. దానికి వారు చెప్పిన కారణాలు చూస్తే.. తెలంగాణలోనూ అలాంటి పోలికలు ఉన్నాయని అందరికీ అనిపించకమానదు. అపాయింట్మెంట్లు ఇవ్వడంలేదని.. నిధులు ఇవ్వడం లేదని.. ఇతరులకే ప్రాధాన్యం లభిస్తోందని .. అందుకే తాము అవమానం ఫీలయ్యామని శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు. అచ్చంగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. కేసీఆర్ కోరుకుంటే తప్ప.. ప్రగతి భవన్లోకి ఎవరికీ ఎంట్రీ ఉండదు. ఈటల రాజేందర్ తాము ఎన్ని సార్లు అవమానాలకు గురయ్యామో పార్టీ నుంచి గెంటేసిన తర్వాత చెప్పుకున్నారు.
హరీష్ రావు, గంగుల కమలాకర్లకూ అదే పరిస్థితి వచ్చిందని చెప్పారు. నిజానికి టీఆర్ఎస్లో మెజార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టం. కేసీఆర్ కలవాలనుకుంటే మాత్రమేకలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానేపార్టీ నేతల్లో అసంతృప్తిఉంది. ఇక నిధుల విషయంలోనూ ఎమ్మెల్యేల అసంతృప్తి చాలా సార్లు బయటపడింది. పార్టీ నాయకులేక బిల్లులు రావడం లేదన్న ఆగ్రహం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యేలను… బీజేపీ టార్గెట్ చేస్తే.. వారివలలో సులువుగా చిక్కుకుంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే మహారాష్ట్రలో బీజేపీకి కొంత బలం ఉంది.
శివసేన ఎమ్మెల్యేలను చీల్చితే… బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో అలాంటి పరిస్థితిలేదు. ఏం చేసినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు. అదే సమయంలో కేసీఆర్ను కాదని పార్టీని చీల్చే నాయకులు కొద్దిమందే ఉన్నారు. వారుతిరుగుబాటు చేస్తారో లేదో చెప్పడం కష్టం. కానీ ప్రజల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకోదల్చుకుంటే… మహారాష్ట్ర రాజకీయాలు… తెలంగాణలో చూసినా ఆశ్చర్యం లేదని కొంత మంది వాదన వినిపిస్తున్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.. ఎందుకంటే ధాకరే ఫ్యామిలీనే ఎమ్మెల్యేలు వద్దనుకుంటారని ఎవరూ ఊహించలేదు మరి !