ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగుతూ చేసిన ప్రధానమైన డిమాండ్ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఇతర డిమాండ్లను వినిపించినా… కేసీఆర్ సర్కారు ఆ ఒక్కటే పట్టుకుని, విలీనం అసాధ్యమని మొదట్నుంచీ చెప్పుకుంటూ వస్తోంది. దాన్ని పక్కనపెడితే చర్చిస్తామని మొదట్లో సంకేతాలు ఇచ్చింది. కానీ, విలీనాన్ని వదిలేది లేదనీ, ముందుగా అదే జరగాలంటూ జేయేసీ కూడా భీష్మించుకుంటూ వచ్చింది. దీంతో చర్చల ప్రక్రియకు రెండువైపుల నుంచి విఘాతం ఏర్పడింది. అయితే, ఇప్పుడు విలీన డిమాండ్ ని తాత్కాలికంగా పక్కనపెడుతున్నామంటూ ఆర్టీసీ జేయేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే, కొన్ని డిమాండ్లను అవసరమనుకుంటే పక్కనపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముందే ప్రకటించామన్నారు. అయినాసరే, ప్రభుత్వం తప్పుడు సమాచారం చెబుతూ, ప్రజలని తప్పుతోవ పట్టిస్తోందన్నారు. విలీనం మీద లేనిపోని కథనాలను ప్రచారం చేస్తోందనీ, అందుకే తాము చర్చించి ఈ విలీన డిమాండ్ ను తాత్కాలికంగా పక్కనపెట్టాలని నిర్ణయించామన్నారు. మిగతా సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం చర్చించాలనీ, న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె మరింత తీవ్రతరం అవుతుందనీ, నిరవధికంగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. హైకోర్టును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బేఖాతరు చేస్తున్నారనీ, రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామన్నా వద్దన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
చర్చలకు విలీన డిమాండే అడ్డంకి అన్నట్టుగా ఉండేది. ఈ విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగి, దాన్ని పక్కనపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా చర్చలకు సిద్ధమంటుందా లేదా అనేది చూడాలి. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వ వైఖరి గమనిస్తే… చర్చలకు ఏ రకంగానూ సంసిద్ధతతో ఉందని అనిపించదు. చర్చలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. హైకోర్టే స్వయంగా కమిటీ వేస్తామని ప్రతిపాదించినా… నిర్ద్వంద్వంగా దాన్నీ కొట్టిపడేసింది. అయితే, ఇప్పుడు కార్మికులే ప్రధాన డిమాండ్ పక్కనపెడుతుంటే… ప్రభుత్వం కూడా అదే తరహా పట్టువిడుపు ధోరణితో స్పందించాలి. ఆర్టీసీ సమ్మె కేసీఆర్ వెర్సెస్ అశ్వత్థామరెడ్డిల వ్యక్తిగత సమస్య కాదు కదా! ఆర్టీసీ వెర్సెస్ ప్రభుత్వానిది. కార్మికుల జీవితాలతోపాటు ప్రజల రవాణా సౌకర్యాలకు సంబంధించిన అంశం. చూడాలి… ఇప్పుడైనా ప్రభుత్వ వైఖరి మారుతుందా లేదా అనేది!