నాగార్జున సాగర్లో గెలవడానికి గతంలో చేసిన తప్పులు చేయకూడదని అనుకుంటున్న కేసీఆర్… బహిరంగసభ పెట్టి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన సభ నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఆయన ప్రచార సభ వద్దంటూ పలువురు కోర్టులు…. మానవహక్కుల సంఘాల వద్దకు వెళ్తున్నారు. సీఎం సభ ఏర్పాటు చేయబోతున్న పొలం తమదేనని.. తమ అనుమతి తీసుకోకుండా సభ ఏర్పాటు చేస్తున్నారంటూ కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కరోనా నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దు అంటున్న ప్రభుత్వం.. లక్ష మందితో సభ ఎలా పెడుతోందని వాదిస్తున్నారు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. ఈ కారణంగా సభకు ఆటంకాలు తీరిపోయినట్లే. అదే సమయంలో బీసీ సంఘాల పేరుతో కేసీఆర్ సభ రద్దు చేయాలని హెచ్ఆర్సీలో మరో పిటిషన్ దాఖలయింది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా సభ ఏర్పాటు చేస్తున్నారని…సభకు అనుమతి ఇవ్వొద్దని ఫిర్యాదులో కోరారు. ఇలా హైకోర్టు.. హెచ్చార్సీల్లో పిటిషన్లు వేసిన వారు రాజకీయ ప్రేరేపితంగానే వేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తున్నారంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
కరోనా ఉద్ధృతమవుతున్న రీత్యా.. ఏపీ సీఎం జగన్ తన ప్రచారసభను రద్దు చేసుకున్నారు. ఈ ప్రకారం కేసీఆర్ కూడా రద్దు చేసుకుని బాధ్యత చూపించాలని కొంత మంది సలహా ఇస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం… సీఎం సభ జరుగుతుందని ఎందుకు అడ్డం పేడే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రచారసభ జరుగుతుందంటున్నారు.