తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గత రెండు సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సారి ఆయన నియోజకవర్గం మారబోతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇస్తున్నాయి. కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే.. రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చిన నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, ఓ సారి టీడీపీ తరపున.. మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెండు సార్లూ ఆయన గెలిచేస్తారన్నంతగా పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో చేరారు.
ఈ సారి కేసీఆర్కు బదలుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారని క్లారిటీ వచ్చేసినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారంటున్నారు. అందుకే ప్రతాపరెడ్డి ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజమో.. వ్యూహమో కానీ దీని వల్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో నమ్మకం పడిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం నియోజకవర్గం మారడం అంటే.. ఓటమి భయంతోనే అన్న ప్రచారం జరుగుతుంది. సీఎంకే ఓటమి భయం అంటే… ఇతరుల పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు.
అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఇప్పటికే టీఆర్ఎస్ పై ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో .. మరింత కాన్ఫిడెంట్గా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడా బేలతనం కనిపించకూడదు. కానీ టీఆర్ఎస్ లో మాత్రం ఆ బేలతనం కనిపిస్తోందన్న అభిప్రాయం.. కేసీఆర్ నియోజవర్గ మార్పు ప్రచారంతో తెలుస్తోందని అంటున్నారు. ఈ విషయలో కేసీఆర్ జాగ్రత్త పడాల్సి ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కేసీఆర్ వ్యూహం ఏమిటో అంచనా వేయడం కష్టమని.. అన్నీ అంచనాలు వేసుకునే నిర్ణయాలు తీసుకుంటారని వారు నమ్మకంగా ఉన్నారు.