కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్లకుపైగా ఆదాయ నష్టం జరిగిందని..ఈ విషయాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించి ప్రజల ముందు ఉంచారని కేసీఆర్ గత నెలలో నిర్ణయించారు. వారం పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదేశించారు.అయితే ఈ నెల ఇరవయ్యే తేదీ వచ్చేసినా ఇంకా అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత రాలేదు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతున్నదని, దీనిపై చర్చించి ఆ వివరాలన్నీ ప్రజలకు చెప్పేందుకు డిసెంబర్ నెలలో వారం పాటు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు సీఎంవో గతంలో ప్రకటించింది. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, బీఆర్ఎస్ ఆవిర్భావం, ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సహా అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు బిజీగా ఉండటంతో ఇప్పటి వరకూ అసెంబ్లీ సమావేశాలపై కసరత్తు పూర్తి కాలేదు. పైగా క్రిస్మస్ పండుగ వస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయా ఉండవా అన్న చర్చ జరుగుతోంది.
అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. వారం కాకపోయినా కనీసం మూడు రోజులు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. క్రిస్మస్ పండుగకు ముందే సమావేశాలు ముగించాలని సీఎం సూచించినట్లు పేర్కొంటున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు జరగొచ్చని చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక విధానాలను లెక్కలతో చెప్పడంతోపాటు గవర్నర్‌కు చాన్స్‌లర్‌గా ఉన్న అధికారాలను తొలగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టొచ్చని అధికార పార్టీ ముఖ్యులు అంటున్నారు.