తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దగ్గర్నుంచీ…. నిన్నటి లోక్ సభ ఎన్నికల వరకూ రాష్ట్రంలో పరిపాలన ఏవిధంగా ఉంది అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ఎందుకంటే, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్ దృష్టంతా జాతీయ రాజకీయాల మీదే ఉంది. లోక్ సభ ఎన్నికలు దాటితే తప్ప, పరిపాలనాపరంగా కీలకమైన నిర్ణయాలేవీ కేసీఆర్ తీసుకోరు అన్నట్టుగానే వ్యవహరించారు. ఇతర పార్టీలతో పొత్తులు అంటూ కొన్నాళ్లు తిరిగారు. ఫెడరల్ ఫ్రెంట్ కి మద్దతు కోసం చర్చలు జరిపారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణను కూడా పక్కనపెట్టేశారు. తెలంగాణలో మంత్రులు లేకుండానే దాదాపు మూడునెలలపాటు పాలన సాగింది. చివరికి, విస్తరించిన ఆ మంత్రివర్గ కూర్పు కూడా పూర్తిగా లేదు.
ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ లు లోక్ సభ ఎన్నికల్లో పార్టీని నడిపించే పనిలోనే నిన్నటి వరకూ నిమగ్నమై ఉన్నారు. ఈ ఇద్దరూ కేబినెట్ లోకి వస్తారా, వారికి కీలక శాఖల్ని కేసీఆర్ అప్పగిస్తారా అనేది ఇంకా స్పష్టత లేని అంశం. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే ఆ స్పష్టత వస్తుంది. అంటే, వచ్చే నెల కూడా దాటిపోయి… జూన్ లో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. పరిపాలనాపరంగా చూసుకుంటే… రెండోసారి కొలువుదీరిన ప్రభుత్వం పనితీరుపై కొన్ని విమర్శలున్నాయి. మంత్రులు లేకపోవడంతో వివిధ శాఖలకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. సచివాలయంలో పెండింగ్ ఫైళ్లు, చెల్లించాల్సిన బిల్లులు, వాటి అనుమతులు ఇలా చాలా ఉన్నాయని అధికారులు వాపోతున్న పరిస్థితి.
ఎన్నికలు ముగిశాయి కాబట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పాలనపై దృష్టిపెడతారా.. లేదంటే, ఎన్నికల ఫలితాలన్నీ వచ్చేశాక, జాతీయ రాజకీయాల్లో కూటమి కట్టేందుకు ఉన్న అవకాశాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాకనే ఇటువైపు చూస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎన్నికలు అయిపోగానే… సాధారణ పాలనపై ఆయన దృష్టి సారిస్తారు అనుకుంటే… ఇప్పుడు కొత్త రెవెన్యూ పురపాలక చట్టాలు అంటున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలలో లంచానికి ఆస్కారం లేని విధంగా మార్పులు తేస్తామంటున్నారు. లంచాలు లేని వ్యవస్థను తెద్దామంటున్నారు. ఇది కచ్చితంగా మంచి ప్రయత్నమే. దీంతోపాటుగా సాధారణ పరిపాలనా విధులపై కూడా సీఎం దృష్టిసారించాలనీ, పెండింగ్ ఉన్న చాలా అంశాలపై ఆయన స్పందించాలంటూ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.