తమిళనాడు సీఎం స్టాలిన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో సహా కలిశారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అంతా బాగున్నా.. వారి మధ్య జరిగిన రాజకీయ చర్చ ఏమిటన్నదానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. తమిళనాడు సీఎం ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి. యూపీఏ సభ్యుడు. కాంగ్రెస్‌ను వదులుకోవాలని ఆయన ఇప్పటికిప్పుడు అనుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. వదులుకునే అవకాశం కూడా లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కుదిరితే స్టాలినే .. కేసీఆర్‌ను కాంగ్రెస్ ఫ్రంట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు.
ఇటీవల కేసీఆర్ కూడా కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగా ఉంటున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ టార్గెట్ ధర్డ్ ఫ్రంట్ అని.. గతంలో బయటకు చెప్పి టూర్లు చేశారు.. ఇప్పుడు మాత్రం రహస్యంగా కొనసాగిస్తున్నారని అంటున్నారు. స్టాలిన్‌తో సమావేశం ముగిసినా కేసీఆర్ చెన్నైలోనే ఉన్నారు. ఆయన మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌తో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ధర్డ్ ఫ్రంట్‌లోకి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చని కొంత మంది క్లారిటీకి వస్తున్నారు.
ఇప్పటికే రహస్యంగా జరుగుతున్న చర్చల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రంలో ఎదురుపడవు. అందుకే ఈ కూటమి సాధ్యమన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతల్లో ఉంది. అయితే కేసీఆర్ పర్యటనలు చేసినంత మాత్రాన.. కూటమి కార్యరూపం దాలుస్తుంని చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల రాజకీయ వ్యూహాలు.. వారి వారి లాభాలప్రకారమే చూసుకుంటారు.