తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. చిత్ర పరిశ్రమ స్థిరపడడానికి సజావుగా బతకడానికి ప్రభుత్వం ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటుందో గానీ.. మొత్తానికి ఆ రంగం మీద దృష్టి సారిస్తున్న సంగతి మాత్రం నిజం. చిత్ర పరిశ్రమ కోసం కేసీఆర్ ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ తాజాగా సినీ ప్రముఖులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు పరిశ్రమను నిలబెట్టడానికి ఉపకరిస్తాయా..? ప్రధానంగా చిన్నిసినిమా బతకడానికి ఇవి ఎంతమేరకు సహకరిస్తాయి? అనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది.
ప్రధానంగా ఒక్క అంశానికి కేసీఆర్ సర్కారులోని కేబినెట్ సబ్ కమిటీని అభినందించాలి. కేవలం చిన్న సినిమా బతకడం కోసం తెలంగాణ వ్యాప్తంగా అయిదు ఆటల పద్ధతిని తీసుకురావడం ముదావహం. ప్రతిరోజూ థియేటర్లలో ఒక ఆట ఎక్కువ వేసుకునే వెసులుబాటు కల్పించి దాన్ని చిన్న సినిమాకు కేటాయించడం వల్ల వారికి మేలు జరుగుతుంది. పైగా సాయంత్రం 4 గంటల ఆటను చిన్న సినిమాకు కేటాయించాలని నిర్ణయించడం బాగుంది. అయితే థియేటర్లు సాయంత్రం 4 గంటల ఆటను విధిగా చిన్న సినిమాలు మాత్రమే వేసేలా నిబంధనలు రూపొందించాలి. అయిదో ఆట అవకాశాన్ని థియేటర్లు వక్రమార్గాల్లో క్యాష్ చేసుకోకుండా చూడాలి. ‘చిన్న సినిమా లేదు’ అని సాకులు చెప్పేట్లయితే.. ఆ రోజుల్లో అయిదో ఆట వేయడానికి వీల్లేదు అని నిబంధన పెడితే తప్ప సాధ్యం కాదు.
అలాగే చిత్రాల షూటింగ్ అనుమతులు 48 గంటల్లోగా ఇచ్చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పేపర్ మీద బాగానే కనిపించవచ్చు గానీ.. ఆచరణలోకి వచ్చేసరికి 48 గంటల్లోగా అనేది గొప్ప విషయమేమీ కాదు. ఆయా అనుమతులకు వెనుక జరిగే అవినీతి వ్యవహారాలు అన్నీ 48 గంటల్లో ముగించవలసి రావడం తప్ప.. మరో వెసులుబాటు నిర్మాతలకు దక్కకపోవచ్చు.
అయితే చిన్న సినిమాలు ప్రదర్శించే థియేటర్ల పరిమితిని 35 స్క్రీన్లనుంచి 50 స్క్రీన్లకు పెంచారు. ఇది ఒక రకంగా చిన్న సినిమాలకు నష్టదాయకమైన నిర్ణయం. పెద్దసినిమాకు దరిదాపుల్లో ఉండే సినిమాలు కూడా ఈ వెసులుబాటును దుర్మార్గంగా వాడుకుని, చిన్న సినిమాల అవకాశాల్ని కబ్జాచేసే ప్రమాదం ఉంది.
ఈ కారణాల నేపథ్యంలో కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా చిన్న సినిమాను బతికించబోతున్నాయా? లేదా.. పైకి అలా కనిపిస్తూ.. యథాతథ అగచాట్ల పరిస్థితినే చిన్న సినిమాకు ప్రసాదించబోతున్నాయా? ఆచరణలో చిన్న సినిమా పట్ల తెలంగాణ సర్కార్ ప్రేమ ఎలా ఉండబోతున్నది? అనే విషయాల్లో వేచిచూడాల్సి ఉంది.