ఖమ్మం సభలో రాహుల్ గాంధీ తాము వస్తే వృద్ధాప్య పించన్లను నాలుగు వేలు చేస్తామని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఒక్క సారిగా ఉలికిపాటుకు గురైంది. ఈ పెన్షన్లు అందుకునేవారు అత్యధికులు … వృద్ధులు. వారికి ప్రత్యేకంగా పార్టీలేమీ ఉండవు. వారికి ఎవరు ఎక్కువ ఇస్తారన్న నమ్మకం ఉంటే వారికి ఓట్లేస్తారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందన్నది సస్పెన్స్ గా మారింది. వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.
ఇప్పటికే కర్ణాటకలోలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా ఇస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలన్న ఆలోచన లో ఉన్నారని చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులతో దీనిపై నివేదిక తెప్పించుకున్నారని.. ఎన్నికలకు ముందు అమలు ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పించన్లను కూడా పెంచినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అందులో రూ. రెండు లక్షల రుణమాఫీ ఉంది.
కాంగ్రెస్ హామీలకు ప్రజలు ఎక్కడ ఆకర్షితులవుతారోనన్న ఉద్దేశంతో కేసీఆర్ కూడా పలు రకాల హామీలు ఇచ్చారు. రూ. లక్షరుణమాఫీ, నిరుద్యోగ భృతి, అన్ని రకాల పించన్ల పెంపు వంటివి ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో ఇబ్బంది పడ్డారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే హామీల్ని ముందే అమలు కు ప్రయత్నిస్తే రాజకీయంగా ప్లస్సా మైనస్సా అన్నది అంచనా వేయలేకపోతున్నారు. కాంగ్రెస్ హామీలే కానీ.. అమలు చేయదన్న ప్రచారాన్ని ఎక్కువగా చేస్తే చాలన్న వాదన బీఆర్ఎస్ లోని మరో వర్గంలో వినిపిస్తోంది.