ఆర్టీసీ కార్మికులను సుదీర్ఘకాలం ఏడిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు వారి మొహాల్లో నవ్వులు పూయించాడు. వారిని సంతోష సాగరంలో ఓలలాడించాడు. వారిని విజయవంతంగా యూనియన్ల నుంచి వేరు చేశాడు. ఇక యూనియన్ల మాట, యూనియన్ నాయకుల మాట ఎత్తకుండా చేశాడు. కొందరు కార్మికులు అమాయకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు అనవసరంగా అందోళనకు గురై ప్రాణాలు కోల్పోయారు. చివరి వరకు ఓపికగా ఉండి, సమ్మె విరమించి డ్యూటీల్లో చేరిన కార్మికులు బొనాంజ అందుకున్నారు. ముఖ్యమంత్రి దరిదాపుల్లోకి కూడా వెళ్లే అర్హత లేని ఆర్టీసీ కార్మికులు ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేసి, శుభవార్తలతో ఇంటిదారి పట్టారు. వీరి వైభవం చూసిన ప్రభుత్వ ఉద్యోగులు ‘మరి మా పరిస్థితి ఏమిటి’ అని అడుగుతున్నారు.
ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంటు వయసు పెంచడం కేసీఆర్ ఇచ్చిన అతి పెద్ద వరం. ఇదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షిస్తోంది. ఏవో ఆశలు రేపుతోంది. నిజానికి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చాడు. ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు చెలరేగాయి. దీంతో తమ 26 డిమాండ్లలో దాన్నీ చేర్చారు. దీంతో కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆ ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా సాగిందో చూశాం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన ముఖ్యమంత్రి కార్మికులు ఊహించనివిధంగా రిటైర్మెంట్ వయసు పెంచి వారి నెత్తిన పాలు పోశాడు. వారు జీవితంలో యూనియన్ల ఊసెత్తకుండా, సమ్మెల ఆలోచన చేయకుండా ఉండేందుకు అనేక వరాలు ఇచ్చేశాడు. ఆర్టీసీని విలీనం చేస్తే అనేక కార్పొరేషన్లు అదే డిమాండ్ చేస్తాయని సమ్మె సమయంలో కేసీఆర్ చెప్పాడు. అందుకే విలీనం చేసే ప్రసక్తే లేదన్నాడు. ఆర్టీసీ ఖతం అన్నాడు. మరి ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంటు వయసు పెంచితే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఆశ పడతారని, వారూ డిమాండ్ చేస్తారని తెలియదా? ఇప్పుడు వారికి కూడా జవాబు చెప్పాలి కదా.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్మెంటు వయసు పెంపుపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వీరికి వేతన సవరణ చేయడంతోపాటు ఉద్యోగ విరమణ వయసు కూడా పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్ చేయడంతో ఉద్యోగులు తమ సంగతి ఏమిటని ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి వారితో కలిసి లంచ్ చేసి, మాట్లాడి వారు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సమ్మె చేయకుండా చూశాడు.
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంటు వయసు పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఆ వ్యవహారంలో బిజీగా ఉంటాడు కాబట్టి, ఉన్నికలు ముగిశాక తమ గురించి ఆలోచించవచ్చని ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడుతున్నారు. చూడాలి మరి సీఎం వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తాడో…!