రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉంటారో ఉండరో గానీ, శుభకార్యానికి మాత్రం శత్రుత్వాన్ని మరిచి వెళ్లి రావడం భారతీయ సంప్రదాయం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది.
రాజకీయ వైరాన్ని పక్కన బెట్టి, అయిన వాళ్లందరిని ఆహ్వానించడానికి చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా పిలుస్తానన్నారు. తెలంగాణలోని అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానించడానికి నిర్ణయించారు.
ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ విభజన ఓ వాస్తవం. అది జరిగి 16 నెలలైంది. ఇప్పుడు కాలం వెనక్కి పోదు. రెండు రాష్ట్రాలూ ముందుకు సాగాల్సిందే. నవ్యాంధ్రకు రాజధాని కావాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రణాళికలు వేస్తోంది.
నిన్న మొన్నటి వరకూ ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్న ప్రాంతం, ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఓ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుంటే హాజరై శుభాకాంక్షలు తెలపాలని కేసీఆర్ నిర్ణయిస్తే అది హర్షణీయం అవుతుంది. రాజకీయ విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇతరత్రా ఆవేశ కావేశాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ, పొరుగు రాష్ట్రంగా, సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి శంకుస్థాపనకు హాజరైతే ప్రజలకు ఓ మంచి సంకేతం ఇచ్చినట్టవుతుంది.
ఇప్పటికే రాజకీయ నాయకులంటే తిట్టుకోవడం, తన్నుకోవడమే అని ఈ తరం యువతలో ఓ అభిప్రాయం ఉంది. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండే రోజులు పోయాయి. ఎవరో కొద్ది మంది మినహా, హుందాగా రాజకీయాలు చేసే వారే కనిపించడం లేదు. అలాంటి సమయంలో, రాజకీయ దురంధరుడైన కేసీఆర్, భావితరాలకు ఓ చక్కటి సందేశం ఇవ్వడానికి ఇది మంచి అవకాశం.
ఇక, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం రాజధాని శంకుస్థాపనకు దూరంగా ఉంటే అది అత్యంత దురదృష్టకరం. చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే మన్నించడం జగన్ కు మంచి పేరే తెస్తుంది. రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నా ఇద్దరికీ ఆ రాష్ట్ర ప్రగతి ముఖ్యం. కాబట్టి దానికి హాజరు కావడమే సముచితం.
పైగా, దేశాన్ని టీమ్ ఇండియాగా, నీతి ఆయోగ్ లో ముఖ్యమంత్రులందరికీ స్థానం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి ప్రధాని సమక్షంలో మన ఐక్యతను చాటడం, ఇరు రాష్ట్రాల ప్రగతి కోసం వీలైనన్ని నిధులు, సహకారం అందించాలని ముక్త కంఠంతో కోరే అవకాశం రావడం అరుదు. దీన్ని జార విడుచుకుంటారో, సద్వినియోగం చేసుకుంటారో కేసీఆర్, జగన్ లే నిర్ణయించుకోవాలి.