బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా తెర ముందుకు వచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇది కమ్యూనిస్టు పార్టీలను మాత్రం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. కేసీఆర్ నట్టేట ముంచుతారా అని వారు అనుమానిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లోభేషరతుగా బీఆర్ఎస్కు కమ్యానిస్టులు మద్దతు ఇచ్చారు. తర్వాత కూడా తమ బంధం కలిసి ఉంటుందని ప్రకటించుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు ఎక్కడెక్కడ పోటీ చేయాలో కూడా లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో అనుమానం వారిలో పట్టి పీడిస్తోంది.
కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నది నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో. అలాగే కొందరు ముఖ్య నేతలు ఉన్న ఇతర జిల్లాల్లోనూ సీట్లు అడగొచ్చు. అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ ఇతర పార్టీలకు సీట్లు కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశంగానే మారింది. కనీసం రెండు పార్టీలకు కలిసి ఐదు స్థానాలైనా కల్పిస్తే.. సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ స్థానాలు ఖమ్మం, నల్లగొండ జిల్లాలోనే ఉంటాయి. ఆ జిల్లాలో బీఆర్ఎస్ లో పోటీ అధికంగా ఉంది. సీట్లు కేటాయించకపోతే పొత్తుల వల్ల ప్రయోజనం ఉండదు.
కమ్యూనిస్టులు కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసమే పోరాడుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం సీట్లు కేటాయిస్తారన్న సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలిస్తామని చెప్పి వారిని సైలెంట్ చేయాలనే ఆలోచన ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే కమ్యూనిస్టు పార్టీలు.. మునుగోడులో మునిగిపోయినట్లే అవుతుందంటున్నారు.