మే నాలుగో తేదీ నుంచి లాక్ డౌన్ విషయంలో… ఆరెండ్, రెడ్ జోన్లకు కొన్ని మినహాయింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించింది. అయితే.. తెలంగాణలో మాత్రం ఏడో తేదీ వరకూ ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఎందుకంటే..తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఏడో తేదీ వరకూ లాక్ డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదో తేదీన మంత్రివర్గ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. కేంద్రమార్గదర్శకాలు.. తెలంగాణలో వైరస్ పరిస్థితిని అంచనా వేసి.. సరైన నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. తెలంగాణను కరోనా ఫ్రీ స్టేట్‌గా చేయాలని కేసీఆర్ పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఆర్థికంగా నష్టం జరిగినా.. భరించాలని.. ఆ వైరస్ అలా అంటి పెట్టుకుని ఉంటే.. చాలా సమస్యలు వస్తాయని నమ్ముతున్నారు.
అందుకే.. మరింత కఠినంగా నిబంధనలు అమలు చేసి అయినా.. కరోనా ఫ్రీ స్టేట్ చేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్రం మినహాయింపులు ఇచ్చినా.. ఇప్పటి వరకూ తెలంగాణలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని కంటైన్మెంట్ జోన్ల నుంచి మాత్రమే కొత్త కేసులు వస్తున్నాయి. మెజార్టీ ప్రాంతాలు గ్రీన్ జోన్లోకి వచ్చాయి. ప్రస్తుతం వైరస్ ముప్పు చాలా వరకు తగ్గిపోయిందని.. ఆరోగ్య మంత్రిఈటల చెబుతున్నారు. రోజుకు నమోదవుతున్న కేసులు.. డిశ్చార్జవుతున్న కేసుల్ని పరిశీలిస్తే.. మరో వారం.. పది రోజుల్లో తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ అవుతుందంటున్నారు.
ఈ నేపధ్యంలో… తెలంగాణ సీఎం కేసీఆర్ మినహాయింపులపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ అత్యంత పటిష్టంగా అమలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయింది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడటంతో.. మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఐదో తేదీన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఎనిమిదో తేదీ నుంచి గ్రీన్ జోన్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు జరుగుతాయన్న సమాచారన్ని ప్రభుత్వ వర్గాలు లీక్ చేశాయి.