ఒకటికి పదిసార్లు చెప్పడం వారి రాజకీయ అవసరం. ఇంత చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదనే అభిప్రాయం వారికి అవసరం. అందుకే, వినరని తెలిసినా కూడా… పదేపదే చెప్పే పయత్నమే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం! దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోడీ సర్కారు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో ఆ పథకం అమలు చేయడం లేదు సీఎం కేసీఆర్. ఎందుకంటే, అంతకంటే గొప్ప పథకాన్నే రాష్ట్రం అమలు చేస్తోందనీ, కేంద్ర పథకం ద్వారా వచ్చే అరకొర లబ్ధి తమకు సరిపోదనేది సీఎం అభిప్రాయం. ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రాలకు ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువనీ, రాష్ట్రంలో అంతకంటే గొప్పగా వైద్యసేవలన్నీ ఒకే గొడుకు కిందకి వచ్చేలా త్వరలోనే ఒక విధానాన్ని తెస్తున్నట్టు ఈ మధ్యనే సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సో… ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ సర్కారు అమలు చేయదు అనేది చాలా చాలా స్పష్టం. అయినాసరే, మరోసారి ఇదే పథకం అమలు గురించి మాట్లాడుతున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్. ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరోసారి కోరారు. కేసీఆర్ గురించి తనకు బాగా తెలుసనీ, ఆయన లవ్లీపర్సన్ అనీ, ఐ లవ్ హిమ్ అంటూ హర్షవర్థన్ అభిప్రాయపడ్డారు! 2022 నాటికి కొత్త భారత్ ను చూడాలనేది ప్రధాని మోడీ కల అనీ, దాన్లో భాగమే ఈ పథకమనీ, ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరిగే ఈ పథకాన్ని అమలు చేయాలంటూ కేసీఆర్ కి లేఖ రాశామన్నారు హర్షవర్థన్. కేసీఆర్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందనీ, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ పథకం తెలంగాణలో అమలు కాదనేది సుస్పష్టం. ఆ విషయం కేంద్రానికీ తెలుసు. మరి తెలిసి తెలిసీ కేసీఆర్ కి ఎందుకీ లేఖలూ విజ్ఞప్తులూ అంటారా? కేసీఆర్ కేంద్ర పథకాలను అమలు చేయడం లేదనే అభిప్రాయం మరింత పెద్దగా వినిపించేలా చేయడం కోసం అన్నట్టుగా ఉంది! అదే కదా భాజపా రాజకీయ అవసరం. తెలంగాణలో కేంద్ర పథకాలు ఎందుకు అమలు కావడం లేదు అనే పాయింట్ మీదే కదా ఈ మధ్య రాష్ట్ర భాజపా నేతలు విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి మరోసారి కేసీఆర్ ని కోరారే అనుకోండి! అదిగో, సాక్షత్తూ కేంద్రమంత్రే చెప్పినా, ఇది ప్రధాని మోడీ కల అని చెప్పినా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పథకం అని చెప్పినా కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారూ అని మరింత గట్టిగా మాట్లాడేందుకు అవకాశం వస్తుంది కదా! భాజపా వ్యూహం ఇదే అన్నట్టుగా కనిపిస్తోంది.