గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం వరకూ మోడీ…బీజేపీపై కేసీఆర్ విధానం ఒక్కటే. ఎగబడిపోరాడటమే. అందు కోసం జాతీయ స్థాయి కూటమి ఏర్పాటు చేస్తానని.. ఫెడరల్ ఫ్రంట్ అని.. మరొకటి అని ఆయన హడావుడి చేశారు. అయితే బీజేపీ ప్రభావం తీవ్రంగా ఉందని.. దుబ్బాక.. గ్రేటర్లో తెలిసిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి.. మళ్లీ బీజేపీ పెద్దలతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రణం లేదు.. రాజీ లేదు.. అనే రకంగా.. అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాజీ ఉందో లేదో తెలియదు కానీ.. రణం మాత్రం లేదని స్పష్టమయింది. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాలు మారిపోయాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా బెంగాల్లో మోడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా సాగిన పోరులో మోడీ ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా విపక్ష కూటమి రెడీ అవుతోంది.
మమతా బెనర్జీ నేతృత్వంలో మోడీవ్యతిరేక కూటమి ఏర్పాటవడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో కేసీఆర్ ఉంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం. బీజేపీ హవా ఎక్కువగా ఉందన్న కారణంగా.. ఆయన కొంత కాలం కిందట వెనుకడుగు వేసి ఉండవచ్చుకానీ.. ఇప్పుడు.. మోడీ ప్రభ తగ్గుతోందని విశ్లేషణలు ప్రారంభమమయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితులను ఆయన ఏ మాత్రం సమర్థంగా డీల్ చేయలేదని.. కొన్ని వేల మంది భారతీయులు చనిపోవడానికి ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న వఅభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. అది ఆయనపై అసంతృప్తికి కారణం అవుతోందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్..మళ్లీ బీజేపీపై కాలుదువ్వే అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిజానికి బీజేపీతో సన్నిహితంగా ఉండాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయ అవసరాల కోసమే.. ఆయన సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అవసరం తీరిన తర్వాత బీజేపీని దూరం పెట్టారు. ఇప్పుడు కూడా.. ఆయన అదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్కు ఎంతో ఆసక్తి ఉంది. జాతీయ రాజకీయాల దృష్టితోనే గతంలో ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అప్పట్లో ఆయన రైతు ఎజెండా తీసుకున్నారు. కానీ పెద్దగా కలసి వచ్చినట్లుగా అనిపించలేదు. ఇప్పుడు.. మమతా బెనర్జీ సారధ్యంలో కొత్త ఎజెండాతో పని చేయాల్సి ఉంటుంది.
కేటీఆర్ రాజకీయ వ్యూహాలను శరవేగంగా మార్చుకుంటారు. ఏది బెటర్ అనుకుంటే అదే చేస్తారు. ఎక్కడా డిఫెన్సివ్ పాలిటిక్స్ ఉండవు. తన విధానంపై ఆయనఎవరికీ వివరణ ఇచ్చుకోరు. అలాంటి పనులే చేయరు. బీజేపీతో రణం లేదన్న నోటితోనే.. రేపు రణమే అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దానికి తగ్గట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మోడీ వ్యతిరేక కూటమిలో కేసీఆరే కీలకపాత్ర పోషించినా ఆశ్చర్యపోనవసరం లేదు.