బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, ఒప్పందాలపై లిఖిత పూర్వక సమాధానం కోరుతూ జస్టిస్ ఎల్. నర్సింహరెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ ఇచ్చే రిప్లైపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యుత్ కొనుగోలు, ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ కు ఇటీవల నోటీసులు ఇచ్చిన పవర్ కమిషన్ జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. కానీ, తనకు జూలై 30వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్ కోరినా కమిషన్ మాత్రం జూన్ 15లోపే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేయడంతో కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
చత్తీస్ ఘడ్ విద్యుత్ కోనుగోలు, యదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో జ్యుడిషియల్ కమిషన్ కోరినట్లుగా కేసీఆర్ శనివారం వరకు లిఖితపూర్వక వివరణ ఇస్తారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేపటిలోగా కేసీఆర్ నుంచి రిప్లై రాకపోతే కమిషన్ ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. తాము కోరినట్లుగా వివరణ ఇవ్వాలంటూ కమిషన్ కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇస్తుందా..? లేదంటే సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుందా…? అనే ప్రశ్నలు మొదలు అయ్యాయి.
ఇప్పటికే ఈ విషయంలో ఐఏఎస్ అధికారులు సురేష్ చందా, అరవింద్ కుమార్ సహా ట్రాన్స్ కో , జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు సైతం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. చివరగా కేసీఆర్ ఇచ్చే సమాధానం కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఆయన కమిషన్ కోరినట్లుగా గడువులోగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చేలా కనిపించడం లేదు.
తనకు మరింత గడువు కావాలని కేసీఆర్ కోరుతున్నా అందుకు కమిషన్ మాత్రం ససేమీరా అంటోంది. దీంతో రేపటిలోగా కేసీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇవ్వకపోతే కమిషన్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.