తెలంగాణ బంగారు తునక అయింది. ఇక దేశాన్ని ఉద్దరిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి.. ఇక తనది తెలంగాణ వాదం కాదని.. జాతీయవాదమని కేసీఆర్ ప్రకటించారు. కానీ తెలంగామ ఎన్నికలకు వచ్చే సరికి.. మనది నీది తెలంగాణ.. నాది తెలంగాణ.. మనది తెలంగాణ.. జై తెలంగాణ అనే నినాదాలు ఇస్తున్నారు. ఢిల్లీ వాళ్లొస్తే తరిమికొడదామంటున్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల్లో వచ్చిన ఈ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి జనమే ఆశ్చర్యపోతున్నారు.
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేశారు. పంజాబ్ లాంటిచోట్ల రైతు కమిటీల్ని నియమించారు. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఒడిషా, ఏపీ, ఇంచార్జుల్ని నియమించారు. మహారాష్ట్రకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తూ.. ఇతర రాష్ట్రాల వాళ్లకు తెలంగాణతో ఏం పని అని దూకుడుగానే ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే కేసీఆర్ తప్పు చేస్తున్నారని…. తెలంగాణ లేకపోతే ఆయన పూర్తిగా బలహీనపడతారన్న అంచనాలు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర సాధన లక్ష్యంతో చేశారు. ఆ పార్టీకి కుల, మతాలకు అతీతమైన ఓటు బ్యాంక్ కేవలం తెలంగాణ వాదం మీదనే ఉంది. అవే ఆ పార్టీకి కవచ కుండలాలు. వాటిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ విజయాల్లో తెలంగాణ వాదానిదే అగ్రస్థానం. ఆ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు . కేసీఆర్ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ముందుకే వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో ఉన్న పరిస్థితుల్ని చూసినా . తర్వాత తన బలాన్ని తాను మళ్లీ తెచ్చుకోవాలని డిసైడయ్యి.. వ్యూహం మార్చినట్లుగా భావిస్తున్నారు.
ముందు ఎన్నికల్లో గెలవాలి… గెలవకపోతే కేసీఆర్ ఊహించనంత గడ్డుపరిస్థితి ఎదురవుతుంది. జాతీయ రాజకీయాలు కాదు ఇంత కాలం తెలంగాణలో నిర్మించుకున్న ఇమేజ్ కూడా పూర్తిగా మసకబారుతుంది. అందుకే.. చివరి అస్త్రాన్ని కేసీఆర్ అందుకున్నారని భావిస్తున్నారు.