ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక చాలా రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి బినామీల్లో ఒకరన్నప్రచారం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత అరబిందో రియాల్టీకి పోర్టులు, సెజ్‌లు కట్టబెట్టారు. చాలా నిగూఢమైన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఏపీలో అమ్మకం అయ్యే సగం లిక్కర్ శరత్ రెడ్డి కంపెనీల్లోనే తయారవుతుందని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి అప్రూవర్ అయ్యారంటే జగన్ ప్రమేయం లేదని చెప్పడానికి అవకాశం లేదు.
జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారింది ఎవరిని టార్గెట్ చేయడానికన్నది సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ టార్గెట్ అని కొంత మంది చెబుతున్నారు. మరి ఆయనను ఒక్కడిని టార్గెట్ చేసి కవితను వదిలేస్తారా అన్న అనుమానం సహజంగానే వస్తుంది. అలా వదిలేస్తే కేసు బలహీనం అవుతుంది. ఎందుకుంటే ఈ స్కామ్‌లో లంచాలు… పెట్టుబడులు.. ఆదాయం భూములు అన్నీ కవిత చుట్టూనే తిరుగుతున్నాయి.
సౌత్ లాబీ నుంచి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు , అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో కవిత తరపున వీరిద్దరే వ్యవహారాలు చక్కబెట్టారు. ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేరంలో పాల్గొన్న వారే తాము ఎలా చేశామో చెబుతున్నారు మరి. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవడం ద్వారా కవిత జైలుకు వెళితే… కేసీఆర్ జగన్ ను ఉపేక్షిస్తారా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. ఎందుకంటే జగన్ గెలవడంతో కేసీఆర్ పాత్ర కీలకమని చెబుతారు. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.