తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ పర్యటనకు మరోసారి వెళ్లడంలేదు. ఇరవై ఆరో తేదీన ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగే కార్యక్రమానికి మోదీ హాజరు కావాల్సి ఉంది. అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం చెప్పడమే కాదు ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఐఎస్బీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్కు ఆహ్వానం కూడా పంపారు. కానీ కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్ అధినేత మోదీకి మొహం చూపించకూడదనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విపక్షాలు ఆరోపించారు. ఢిల్లీ నుంచి దేశవ్యాప్త పర్యటన చేయాలని ఐదు రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే హఠాత్తుగా పర్యటనను కుదించుకుని సోమవారమే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ కారణంగా ఆయన మోదీ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న చర్చ ప్రారంభమయింది. అయితే మోదీ హాజరయ్యే కార్యక్రమాలకు ఎప్పట్లాగే దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో సమతామూర్తి విగ్రహావిష్కకరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు. చివరి క్షణం వరకూ హాజరవుతారనుకున్నారు. కానీ శిలాఫలకంపై పేరు లేకపోవడంతో అవమానికి గురవుతానన్న ఉద్దేశంతో ఆయన ఆగిపోయారు. అప్పుడే ఇక్రిశాట్ సదస్సులో పాల్గొనేందుకూ వెళ్లలేదు. ఆ తర్వాత పీఎంవోనే కేసీఆర్ను హాజరు కావొద్దని చెప్పాయని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కేటీఆర్ కూడాఇదే అన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.