కాంగ్రెస్ తెలివి తక్కువ పనుసు చేసి తనకు తానే ఓడిపోతుంది.. ఈ సారి మనం మళ్లీ అధికారంలోకి వస్తాం పదిహేనేళ్లు పవర్ లో ఉంటాం అని కేసీఆర్ తనను కలిసిన జడ్పీ చైర్మన్లకు చెప్పారు. పార్టీ కార్యాలయానికి కూడా రాకుండా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతున్నారు. అక్కడికే పార్టీ నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఎవరూ పార్టీ మారవద్దని భవిష్యత్ మనదేనని మాటల్లో చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ ఏం చేయబోతోందో మాత్రం చెప్పడంలేదు.
కాంగ్రెస్ దానికంతటికి అది ఓడిపోతుందని మళ్లీ మనమే గెలుస్తామని అంటున్నారు. గతంలో అయితే అలాగే అనుకునేవారేమో కానీ ఇప్పుడు ఎదురుగా బీజేపీ ఉంది. కాంగ్రెస్ ను వద్దనుకుంటే ఓటర్లు బీజేపీ వైపు చూస్తారు. చూస్తున్నారు కూడా. ఆ విషయం లోక్ సభ ఎన్నికల్లో తేలిపోయింది. వారందరికీ బీఆర్ఎస్ చాయిస్ అనిపించుకోవాలంటే కేసీఆర్ చేయాల్సింది చాలా ఉంది. పదేళ్ల పాటు తాము అద్భుతమైన పాలన చేశామని తమ పాలనను ప్రజలు మిస్సవుతున్నారని ఆయన అనుకుంటే అంత కంటే రాజకీయంగా రాంగ్ స్టెప్ ఉండదు. దురదృష్టవశాత్తూ కేసీఆర్ అదే అనుకుంటున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే బీఆర్ఎస్ కు చెందిన ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా జాతీయ పార్టీల్లోకి వలస పోతుందన్న ఆందోళనలో ఉన్నారు. వారందరికీ ఫీల్డ్ లోకి వెళ్లి ధైర్యం చెప్పాల్సిన అగ్రనేత.. మనకు మళ్లీ అధికారం వస్తుందని.. ఈ సారి పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్తో ముఫ్పై ఏళ్లు అధికారం అన్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్‌లో కూర్చుని అదే కబుర్లు చెప్పాల్సి వస్తోంది.