ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందన్న చర్చ సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టున్న నేత కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ గవర్నర్ కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే ఎలా ఉంటుంది..?అనే అంశంపై కేంద్ర పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గిరి విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉండటంతో ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా నియమిస్తే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయోననేది ఆసక్తికరంగా మారింది.