ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత తొలి సారిగా విజయవాడ వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరపున కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హపార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆయనకు ఓ స్పష్టత ఇచ్చిందని చెబుతున్నారు. కిరణ్ రెడ్డి రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని కూడా బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఆయన సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు ఆయన తెరపైకి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. ఆయన కు పార్టీ తరపున పని చేసే చాన్స్ ఇవ్వలేదో.. ఆయనే వద్దన్నారో కానీ.. రాజీనామా చేసే వరకూ ఆయన పెద్దగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు. ఇప్పుడు కిరణ్ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ద్వారానే యాక్టివ్ పాలిటిక్స్‌లో అడుగుతున్నారని అనుకోవచ్చు.
ఢిల్లీలో బీజేపీలో చేరిక సమయంలో పెద్దగా హడావుడి లేకుండా రాష్ట్ర నేతలు ఎవరూ రాకుండానే బీజేపీలో చేరిపోయారు. కానీ ఏపీ బీజేపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఎవర్నీ ఎవరూ ఆహ్వానించరు… ఇప్పుడు కిరణ్ ను వీరందరూ స్వాగతిస్తారా అన్న చర్చ ఉంది. బీజేపీ ఏపీలో అనుకున్నంగా ఎదగలేకపోతోంది. వలస నేతలు వచ్చినా పరిస్థితి మారలేదు. కిరణ్ రెడ్డి ఆలోచనలతో బీజేపీ ఓ ప్రయోగం చేస్తుందని.. అది విజయవంతం అవుతుందని గట్టి ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ కిరణ్ రిటైరైన బ్యాట్స్ మెన్ అని.. ఏమీ చేయలేరని కొంత మంది నిష్ఠూరమాడుతున్నారు