ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. ఈ అంశంపై కిరణ్ కుమార్ రెడ్డి వైపు నుంచి స్పష్టత లేదు. ఆయన సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఆయన ఏ రాజకీయ కార్యక్రమంలోనూ కనిపించడం లేదు. ఏపీ రాజకీయాలు అసలు చేయడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పదవులు కూడా లేవు. ఎన్నికల సందర్భంగా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం. మాజీ సీఎంలకు బీజేపీలో ఎంతో కొంత ప్రాధాన్యత లభిస్తుంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. ఏదో ఓ పదవి కూడా లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా బలపడాలో అర్థం చేసుకోలేకపోతున్న బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం ఏమైనా పనికొస్తుందన్న ఆశతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కిరణ్ ఏ మాత్రం ఆసక్తి చూపినా బీజేపీ కాదనడానికి అవకాశం లేదు. అయితే కాంగ్రెస్ లో చేరిన ఆయన ఎలా ఉన్నారో.. బీజేపీలోనూ అలా ఉంటే.. ప్రయోజనం ఉండదన్న వాదన ఉంది.
కిరణ్ కుటుంబం పీలేరు నియోజకవర్గం పెట్టని కోటగా ఉండేది. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ సీఎం అయిన తర్వతా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సోదరుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓ సారి సొంత పార్టీ నుంచి మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి టీడీపీ తరపున తీవ్రంగా పోరాడుతున్నారు.