వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని ఆ మధ్య ఓసారి కనిపించి మళ్ళీ పత్తా లేకుండా పోయాడు. జగన్ తోనున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఓటమి తర్వాత కూడా జగన్ కు కొడాలి నాని కుడిభుజంగా ఉంటారనుకున్నారు. కానీ, ఎందుకో ఆయన పెద్దగా జగన్ తో కనిపించడం లేదు.
కొద్ది రోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని గురించి గుడివాడలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన సైతం కేశినేని నాని బాటలోనే నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తీవ్రం కావడంతో ఎందుకు కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే, ఆయన అనారోగ్య సమస్యతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటుండగా.. ఊహించని విధంగా వైసీపీ ఓడిపోవడంతోనే క్రమంగా రాజకీయాలకు దూరం కావాలన్న ఆలోచనతో ఉన్నారని మరికొంతమంది అంటున్నారు.
నిజంగా ఈ ఆలోచనే కొడాలి నాని మనసులో ఉంటే ఆయన ఇప్పటికప్పుడు అధికారికంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం లేదు. అదే జరిగితే చాలామంది వైసీపీ నేతలు కొడాలి నాని బాటలోనే పయనించనున్నారు. అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీపై ఇది తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఇప్పటికప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పకుండా, క్రమంగా పార్టీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తు ఉండొచ్చు. అలా ఎన్నికల నాటికి తన ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉంది.