అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న వారు రెచ్చిపోతే.. దాన్నే ప్రజలకు చూపించి .. అసహనంగా ప్రచారం చేయాలని అనుకుంటాయి. కానీ ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రతిపక్షాల్ని రెచ్చగొట్టాలని అధికార పార్టీ హద్దులు దాటి పోతోంది. బూతులు.. తిట్ల దండకం లాంటివి హైరేంజ్లో నడుస్తున్నాయి. ఇప్పుడు కొడాలి నాని దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. దేవినేని ఉమ నియోజకవర్గంలో భాగమైన గొల్లపూడిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని.,. దేవినేని ఉమను ఇంటికెళ్లి బడితెపూజ చేస్తానని సవాల్ విసిరారు. రోడ్డు మీద తాగుబోతులు.. రౌడీలు… చేసుకునే సవాళ్ల తరహాలో ఆయన మాట్లాడటంతో… దేవినేని ఉమ కూడా స్పందించారు. తాను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు కూర్చుకుంటానని వచ్చి కొట్టాలని సవాల్ చేశారు.
ఓ కంట్రోల్ లేని మంత్రి మాట్లాడటం.. దానికి స్పందించకపోతే.. దేవినేని ఉమ భయపడ్డారన్నట్లుగా ఓ వర్గం మీడియా ప్రచారం చేయడంతోనే ఆయన స్పందించారు. ఓ వీధి రౌడీలా మాజీ మంత్రిని.. ఇంటికొచ్చి కొడతానని ఓ మంత్రి బెదిరించడాన్ని ఖండించాల్సిన మీడియా… కొడతానంటే..భయపడుతున్నావా అంటూ దేవినేని ఉమ వెంట పడింది. దాంతో ఆయన కూడా.. సవాల్ చేశారు. సీఎం జగన్‌పై మళ్లీ మళ్లీ విమర్శలు చేశారు. జగన్ ఢిల్లీ వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నారని మండిపడ్డారు. అలా అనడమే కాదు.. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావాలని సవాల్ చేశారు.
ఇప్పుడు గొల్లపూడిలో చెప్పినట్లుగా దేవినేని ఉమ దీక్షకు కూర్చోడం ఖాయం. మరి కొడాలి నాని వస్తారా లేదా అన్నదే సస్పెన్స్. అంతకంటే ముందు.. పోలీసుల్ని ప్రయోగించి.. అసలు గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు దేవినేని ఉమను వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే దేవినేని ఉమ మాత్రం… తన ఇంట్లో అయినా దీక్షచేస్తానని.. వచ్చి తనను టచ్ చేయాలని అంటున్నారు. హుందా అయిన రాజకీయాలకు ప్రతీ అయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యంత దారుణంగా… ఇంటికొచ్చి కొట్టుకోవడం వరకూ దిగజారిపోయింది.ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో..!