తెలంగాణ జన సమితీ అధ్యక్షుడు కోదండరాం… ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మరో ఆరు నెలల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.వీటిలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కోదందరాం బరిలోకి నిలిచే అవకాశం ఉంది. మరో స్థానం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి కూడా మరో అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కోదండరాం నేరుగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ.. టీజేఎస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మాత్రం… ఈ విషయంలో.. నిర్ణయానికి వచ్చేసింది.
తెలంగాణ ఉద్యమంలో కోదండరాంది కీలక పాత్ర. ఆయన జేఏసీ అధ్యక్షునిగా కీలక కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని కేసీఆర్ అనుమతి లేకుండానే నిర్వహించారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. అన్ని పార్టీను ఏకతాటిపై ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ఇతర ఉద్యమకారులు పదవులు పొంది.. మంత్రులు కూడా అయ్యారు. కానీ కోదండరాం మాత్రం.. ఎలాంటి టిక్కెట్లు కానీ.. పదవులు కానీ ఆశించలేదు. కేసీఆర్ ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లుగా చెబుతూంటారు. తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఉన్నారు.
తెలంగాణకు జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగాం నుంచి పోటీ చేయాలని కూడా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పట్టుబట్టి మరీ తన సీటును తాను కేటాయింప చేసుకున్నారు. ఫలితంగా కోదండరాం ఎక్కడా పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు.. ఎమ్మెల్సీగా బరిలోకి దిగడం మాత్రం ఖాయమే. పట్టభద్రులు… ప్రలోభాలకు లొంగరు. గతంలో అనేక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. దీన్ని రుజువు చేశాయి. దీంతో.. ఎమ్మెల్సీ స్థానంలోకి బరిలోకి దిగితే విజయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా గెలిచి వస్తే.. తెలంగాణ రాజకీయంలో మార్పు ప్రారంభమైనట్లేనని అనుకోవచ్చు.