విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు కీలక మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు.. కేంద్ర హోంశాఖ ఈ కేసు దర్యాప్తు బాధ్యత తీసుకుంటుందా లేదా..అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు అప్పగించాలన్న వాదనపై.. విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్రానికి అభిప్రాయం చెప్పేందుకు పది రోజులు గడువు ఇచ్చింది. వ్యక్తిగత దాడి కాబట్టి తామే విచారిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది.. జరిగింది వినామాశ్రయంలో కాబట్టి… కేంద్ర దర్యాప్తు సంస్థలే దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు.
దీంతో హైకోర్టు.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 14లోగా జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటన ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందో రాదో.. పది రోజుల్లో చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సీఐఎస్ఎఫ్ ఇచ్చిన సమాచారం కొంత తమ దగ్గర ఉందని.. కేంద్రం తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టాలని కోరుకుటున్నారు. ఏపీ పోలీసుల దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు.. రక్తపు మరకలు అంటిన చొక్కా.. ఇచ్చినప్పటికీ.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దని ఆయన పిటిషన్ వేశారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం నేపధ్యంలో…కేంద్రం ఈ కేసు దర్యాప్తును తీసుకుంటాందా.. ఎన్ఐఏను రంగంలోకి దించుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఇదేమంత పెద్ద కేసు కాదని.. ఎన్ఐఏ చెపట్టాల్సిన అవసరం లేదని నివేదిక ఇస్తే… వైసీపీ స్పందన ఎలా ఉంటుందనేది..మరో ఆసక్తికరమైన అంశం.