మంత్రి అవ్వాలనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరిక. ఇందుకు సంబంధించి తన మనసులోని మాటను పదేపదే వెలిబుచ్చుతూనే ఉన్నారు.కానీ, ఇక్వేషన్స్ కుదరకపోవడంతో…తాజాగా వచ్చిన అవకాశంతో మినిస్టర్ అయిపోవాలని రాజగోపాల్ రెడ్డి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తా. తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతు పెట్టినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు పార్టీ పెద్దలు కూడా అంగీకరించారని రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చామల కిరణ్ గెలుపు కోసం గత వారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ వెళ్లి భేటీ అయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భువనగిరిలో చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
అయితే, ఎన్నికలకు ముందు బీజేపీని వీడి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే మంత్రి పదవి విషయమై అధిష్టానంతో చర్చించారని టాక్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరగా అందుకు వారు సానుకూలంగా స్పందించారని… కానీ నల్గొండ జిల్లా నుంచి ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కడంతో రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైనట్లుగా తెలుస్తోంది.
కానీ, త్వరలోనే తాను మంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి పదేపదే చెప్తున్నారు. ఈ సమయంలోనే భువనగిరిలో రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ గెలుపు తనకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. కిరణ్ ను ఎంపీగా గెలిపించే బాధ్యత నాది. కానీ , నాకు మంత్రి పదవి ఇవ్వండని ఆయన కోరినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.