మహాకూటమి పొత్తుల్లో భాగంగా.. తెలుగుదేశం పార్టీ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు స్థానాలను తీసుకుంది. అందులో ఒకటి మహబూబ్ నగర్ కాగా.. మరొకటి… మక్తల్. మక్తల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2009లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ప్రతి మండలంలోనూ అనుచర వర్గం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన… డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డిపై విజయం సాధించారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సారి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ కూడా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా కొత్తకోట దయాకర్ రెడ్డి నిలబడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిలబడ్డారు. అయితే.. చిట్టెం .. టీఆర్ఎస్లో చేరారన్న మాటే కానీ.. ఆయన సొంత అనుచరవర్గం తప్ప.. టీఆర్ఎస్ క్యాడరెవరూ ఆయనకు సహకరించడం లేదు. చివరికి రామ్మోహన్ రెడ్డికే టిక్కెట్ ఇవ్వడంతో.. టీఆర్ఎస్ నేతలు.. సహాయనిరాకరణ ప్రారంభించారు. దాదాపు ప్రతి మండలంలోనూ.. టీఆర్ఎస్ నేతలు.. చిట్టెంను వ్యతిరేకిస్తున్నారు. పరిస్థితిలు క్లిష్టంగా మారడంతో.. బాధ్యతను ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించారు. అయితే జితేందర్ రెడ్డితో పాటు… ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి కూడా… అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అగ్రనాయకత్వం బుజ్జగింపులకు సరేనన్నా… ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి సహకరించరని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా.. ఈ నియోజకవర్గంలో కాస్తంత బలంగానే ఉంది. 2004లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా బీజేపీ మక్తల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచింది. కొద్దిలో .. విజయాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికలోనూ.. పది నుచి ఇరవై వేల ఓట్ల వరకూ సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు విజయం సాధించేంత రేసులో లేకపోయినా.. పోటీ మాత్రం పడుతోంది.
ఇతర పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మహాకూటమి అభ్యర్థిగా… కొత్తకోట దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. చిట్టెం రామ్మోహన్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ సోదరుడు. అయితే ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా.. రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అప్పట్నుంచి ఇరువురి మధ్య రాజకీయ సంబంధాలు లేవు. కొత్తకోట దయాకర్ రెడ్డి.. డీకే అరుణ సంపూర్ణంగా సహకరిస్తే.. అక్కడ మహాకూటమి విజయం సాధించడం సులువేనన్న అభిప్రాయం ఉంది. మాజీ ఎమ్మెల్యేగా… గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వత కూడా.. మక్తల్ నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు కొత్తకోట దయాకర్ రెడ్డి. ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా జతకలవడంతో… విజయానికి ఢోకా లేదన్న భావనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెంపై వ్యతిరేకత… ప్రభుత్వ వ్యతిరేకత.. కలగసి… వస్తుందని అంచనా వేసుకుంటున్నారు.