రంగమార్తాండతో కృష్ణవంశీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా క్లాసికల్ టచ్‌తో అందరి మన్ననలూ పొందుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈమధ్య థియేటర్లకు వెళ్లి చూసేలా సినిమాలు రావడం లేదు. ఆ లోటు… రంగమార్తాండ తీర్చేసింది. ఈ సినిమాకి భారీ వసూళ్లు రాకపోవొచ్చు కానీ, ఆ సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోవడం ఖాయం. రంగమార్తాండ అయిపోయింది. మరి కృష్ణవంశీ నెక్ట్స్ సినిమా ఏమిటి?
ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయన `అన్నం` అనే కథని రెడీ చేసేసుకొన్నాడు. ఈ స్క్రిప్టు ఎప్పుడో సిద్ధం. అయితే… పొడక్షన్ హౌస్, హీరో.. ఈ రెండూ కావాలి. రంగమార్తాండని మైత్రీ మూవీస్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఫలితం పట్ల మైత్రీ సంతోషంగా ఉంది. అంతే కాదు.. కృష్ణవంశీతో ఓ సినిమా చేయడానికి సిద్ధమైంది. కృష్ణవంశీ తన `అన్నం` కథని మైత్రీకి వినిపించారు. ఈ సినిమా చేయడానికి మైత్రీ కూడా రెడీ అవుతోంది. అయితే.. ఇప్పుడు అసలు సమస్య హీరో దగ్గరే. కృష్ణవంశీకి ఓ పెద్ద హీరో కావాలి. `అన్నం`లాంటి కథని చెప్పడానికి… హీరోకి ఓ స్థాయి ఉండాలన్నది కృష్ణశంశీ మాట. తన దృష్టి ఎన్టీఆర్, అల్లు అర్జున్, కార్తీ, సూర్య… ఈ రేంజ్ హీరోలపై ఉంది. కానీ..బన్నీ, ఎన్టీఆర్‌లు దొరకనే దొరకరు. వాళ్లకు కృష్ణవంశీతో సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నా, టైమ్ అందుబాటులో లేదు. కార్తి, సూర్య లాంటి హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వాళ్లు కూడా ఇప్పటికిప్పుడు దొరికే పరిస్థితి లేదు. ద్వితీయ శ్రేణి హీరోలతో కృష్ణవంశీ ఈ ప్రాజెక్ట్ చేయడు. కాబట్టి.. `అన్నం` అనే కథ.. ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే అనిపిస్తోంది. కృష్ణవంశీ ఏం చేస్తాడో చూడాలి.