కేటీఆర్. కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ రాష్ట్ర సమతి కార్యనిర్వాహక అధ్యక్షుడు. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారడు. ఇన్నీ విశేషణాలున్నా… ఎక్కడో ఏదో లోపం కనపడుతోంది. ఎక్కడో ఏదో వెలితి గోచరిస్తోంది. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్లుగా ఉంది.
ఎవరికి లోపం కనపడుతోంది. ఎవరికి వెలితి గోచరిస్తోంది. ఎవరికి ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంకెవరికీ కేటీఆర్ అభిమానులకి.. కేటీఆర్ అనుయాయులకి.. కేటీఆర్ కుటుంబ సభ్యులకి. ఇంతకీ ఆ వెలితి, లోపం, మిస్ అవడం ఏమిటీ అనుకుంటున్నారా…?
ఇంకేముంది ముఖ్యమంత్రి పీఠం. శాసనసభ ఎన్నికల తర్వాత ఏ పదవి లేని కేటీఆర్ కు ఆ తర్వాత అదను చూసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. ఆ తర్వాత కొన్నాళ్లకు కేటీఆర్ కు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు తెలంగాణ సీఎం. ఇన్ని జరిగినా కేటీఆర్ అనుయాయులకు, అనుంగుఅనుచరులకు, కుటుంబ సభ్యులకు కేటీఆర్ కు రావాల్సిన పదవి ఇంకా రాలేదనే వెలితి వెంటాడుతోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఇందుకు భిన్నంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రిగా తన కుమార రత్నం ఇంట అందరి మనసులు గెలవాలంటే ముందుగా బయట తానేమిటో నిరూపించుకోవాలని భావిస్తున్నారట. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ ఎంత అర్హుడో పార్టీలో సీనియర్లే కాదు.. తెలంగాణ ప్రజలు కూడా భావించాలని ఆయన అనుకుంటున్నారట. దీనికి కారణం ముఖ్యమంత్రి కుమారుడిగా ఆ పీఠం ఎక్కాడనే పేరు తెచ్చుకోకూడదని, అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని సీనియర్ నాయకులు, ప్రజలు భావించాలన్నదే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు.
ఇందులో భాగంగానే రచ్చ గెలిచి చూపించాలని తండ్రీ కొడుకుల ఆలోచగా చెబుతున్నారు. ఇటీవల దావోస్ లో జరిగిన ఆర్ధిక సమావేశాల్లో కాని, ఇటీవల ముంబాయిలో జరిగిన నాస్కామ్ సాంకేతిక నాయకత్వ సదస్సులో కాని ఐటీ శాఖ మంత్రిగా కే.తారక రామారావు తమ ప్రభుత్వ విధివిధానాలను ప్రపంచ దేశాలకు చాటారు. తెలంగాణలో అభివ్రద్ధి ఎంత త్వరితగతిన జరుగుతోంది, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తాము ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం వంటి అంశాలను ప్రపంచ వాణిజ్యవేత్తలకు గణాంకాలతో సహా వివరించారు.
ఒక విధంగా దావోస్ సదస్సులో కే.తారక రామారావు పారిశ్రామిక రంగంలో తెలంగాణ వాణి వినిపించారని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ముంబాయ్ లో జరిగిన నాస్కామ్ సాంకేతిక నాయకత్వ సదస్సులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడిన కేటీఆర్ కేంద్ర పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో వివరించారని చెబుతున్నారు. తనకు అవకాశం దొరికిన ప్రతి సమావేశంలోను తానేమిటో, తనకు ముఖ్యమంత్రిగా ఉన్న అర్హతలు ఏమిటో వివరిస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఇలా రచ్చ గెలుస్తున్న కే.తారక రామారావు ఇంట కూడా గెలవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, పార్టీ ముఖ్యుల చేత అనిపించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కట్టపెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఇంకెన్నాళ్లో కాదని, త్వరలోనే ఆ పని కూడా పూర్తి అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.