తెలంగాణలో ఉద్యోగాల భర్తీ టాపిక్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామని కేటీఆర్ ప్రకటించారు. ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీపై బహిరంగలేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో జరిగిన ఉద్యోగాల భర్తీ 1,32,899, శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టుల వివరాలను కూడా తన లేఖలో కేటీఆర్ వెల్లడించారు. ఉద్యోగాల భర్తీపై అందరూ అబద్దాలు చెబుతున్నారని.. కేటీఆర్ మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకి మరోసారి స్పష్టత ఇచ్చేందుకు, ప్రతిపక్షాల అసత్య ఆరోపణలతో అయోమయానికి గురికాకుండా ఉండేందుకే వివరాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు.
లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చినవే. ప్రైవేటు రంగంలో కల్పించినవి మరో 14లక్షలు ఉంటాయని కేటీఆర్ చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి యువత అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అయితే.. వెంటనే రియాక్షన్ అన్ని వైపుల నుంచి వచ్చింది. ఇదే తడవుగా… ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చిద్దాం రమ్మని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ బరిలో ఉన్న వారందరూ… వేర్వేరుగా సవాళ్లు చేస్తున్నారు. కేటీఆర్ ఎక్కడ అంటే అక్కడ చర్చకు రెడీ అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు.. బరిలో ఉన్న ఇతర ప్రముఖులు.. కోదండరాం వంటి వారు కూడా.. తెలంగాణ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చర్చకు రావాలని పిలుపునిస్తున్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో యువత.. నిరుద్యోగుల ఓట్లే కీలకంగా మారాయి. తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు, నియామకాలు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు నియామకాల ఎజెండాగా మారాయి. అందుకే ఉద్యోగాల భర్తీ అంశం.. కీలకంగా మారింది. ఆశించినన్ని ఉద్యోగాలను తెలంగాణ సర్కార్ భర్తీ చేయలేదన్నది నిజం. అందుకే.. ఎన్నికలకు ముందు యాభై వేల ఉద్యోగాల భర్తీ పేరుతో కేసీఆర్ ప్రకటనలు చేశారు. ఆ అసంతృప్తి యువతలో కనిపిస్తోంది. అందుకే ఉద్యోగాల భర్తీ అని.. అంటున్నారు కానీ అది మరింత చర్చకు కారణం అవుతోంది. టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారుతోంది.