తెలంగాణలో ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే… ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలో స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని ..ఆ మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ అంశం కేసీఆర్ సొంతంగా ఇనిషియేట్ చేసుకున్నదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఇటీవల నరేంద్రమోడీ నేతృత్వంలో… 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీలో ముఖ్యమంత్రులు.. గవర్నర్లతో పాటు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరితో మోడీ వర్చువల్ సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్న తర్వాత… ఫటాఫట్ నిర్ణయాలు ప్రకటించేశారు. వెంటనే పాతిక కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి… ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారికి బాధ్యతలు ఇచ్చేశారు. ఇతర కమిటీ సభ్యులను కూడా నియమించారు. ఇందులో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. పన్నెండోతేదీన ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం వెనుక జాతీయ వాదాన్ని మరింత బ లంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఆ జాతీయ వాదం … బీజేపీ వాదమని.. కేంద్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై దేశ వ్యతిరేకుల ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా బీజేపీ వ్యూహం అదే. వ్యతిరేకించలేని స్థితికి ఇతర పార్టీలు వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో… తెలంగాణలో.. బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టేలా… బీజేపీ కన్నా.. తమకే ఎక్కువ జాతీయ వాదం ఉందని నిరూపించుకునేలా.. కేసీఆర్.. ఘనంగా వేడుకలు నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. మోడీ సమీక్ష ముగియగానే రంగంలోకి దిగారని భావిస్తున్నారు.