బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక ఇంచార్జ్ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేటీఆర్ కు సవాల్ తో కూడుకున్నదే అయినప్పటికీ ఈ విజయం బీఆర్ఎస్ కు ఆవశక్యం. పైగా కేటీఆర్ నాయకత్వానికి ఈ ఎన్నిక అగ్నిపరీక్షలాంటిది.
ప్రతికూల పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ ఈ ఎన్నికను ఎదుర్కోబోతుంది. ఇప్పటికీ నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్ పై ఆగ్రహంగానే ఉన్నారు. అయినప్పటికీ ఈ సిట్టింగ్ స్థానంలో వారిని బీఆర్ఎస్ వైపు కేటీఆర్ ఎలా టర్న్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపదనే విశ్లేషణల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక విజయం గులాబీ పార్టీకి ఊపిరిపోయనుంది. లేదంటే ఆ పార్టీ ఉనికే డేంజర్ జోన్ లోకి వెళ్తుంది. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను కేటీఆర్ కు అప్పగించింది పార్టీ.
అసలు ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే బీఆర్ఎస్ ఉనికికి ఎలాంటి డోఖా ఉండదు. పైగా కేటీఆర్ నాయకత్వంపై అందరి భ్రమలు తొలగిపోనున్నాయి. ఓడితే మాత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించాలని అంతర్గతంగా డిమాండ్ చేస్తోన్న నేతల వాయిస్ కు బలం వచ్చినట్లే. ఎటు చూసినా ఈ గ్రాడ్యుయేట్ బైపోల్ బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కేటీఆర్ నాయకత్వానికి బిగ్ టాస్క్ గా మారాయి.