అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు మాదిరిగానే మంత్రి అయ్యారు! ఈ పోలిక ఏంటని అనుకుంటున్నారా..? ఇదే కదా గతంలో తెలుగుదేశం నేతలు కూడా చెప్పుకొచ్చింది. తెలంగాణలో కేటీఆర్ మంత్రిగా దూసుకెళ్తున్నట్టుగానే.. ఆంధ్రాలో చినబాబు రాణిస్తారనే కదా వారూ కోరుకున్నది. సరే, ఎట్టకేలకు ఏపీ టీడీపీ నేతల కలనెరవేరింది కదా..! ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ పంచ్ వేశారు.
జగిత్యాల పర్యటన సందర్భంగా మీడియాతో కాసేపు మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ఇదే సందర్భంలో నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాను లోకేల్ అంటూ నారా లోకేష్ ప్రచారం చేశారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోనే పుట్టాననీ, ఇక్కడిని మనిషినే అని అప్పట్లో చెప్పుకుని తిరిగిన లోకేష్, ఇవాళ ఆంధ్రాకి వెళ్లి మంత్రి పదవి పొందారని విమర్శించారు. నారా లోకేష్ ఆంధ్రాకి వెళ్లడంతోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మూతపడిందని అన్నారు. రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు తాను ఏదో కావాలని ఆశించడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే, మరో పదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు.
నిజానికి, కేసీఆర్ – లోకేష్ ల మధ్య అప్పట్లో మాటల యుద్ధం బాగానే సాగింది. ఇప్పుడు మరోసారి దానికి కేటీఆర్ తెర తీశారు. మరి, పంచ్ కి లోకేష్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అయితే, నారా లోకేష్ ను మంత్రి కేటీఆర్ తో పోల్చిన ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం నాయకులకు ప్రతివిమర్శలు తప్పలేదు. ఇప్పుడూ తప్పవు! ఎందుకంటే.. ఉద్యమ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, ప్రజామోదం పొందారు. కానీ, నారా లోకేష్ అలా కాదు కదా..! ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ అయిపోయారు. ఇప్పుడు మంత్రి అయిపోయారు. సో.. ఇక్కడే అసలైన తేడా ఉందనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నారు.