లోక్ సత్తా పార్టీ పేరు వినగానే తెలుగువారికి గుర్తొచ్చేది ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన జయప్రకాష్ నారాయణ. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేయడం పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం తెలిసిందే. ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ నాయకులు గా కొనసాగుతున్న పలువురు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరు జనసేన వర్గాలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే తుది విడత చర్చలు గా వీరు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.
లోక్ సత్తా పార్టీ నాయకుడు కటారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ జరపనున్నట్లు సమాచారం. అయితే లోక్ సత్తా పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ వీడి జనసేనలో చేరనున్నారా లేదంటే అదే పార్టీలో ఉంటూ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారా అన్నదానిమీద స్పష్టత లేదు. లోక్సత్తా పార్టీ జనసేన లో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నప్పటికీ తుది విడత చర్చల వివరాలు బయటికి వచ్చాకే వీటన్నిటిమీద స్పష్టత రానుంది.
ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే ముందడుగు వేస్తున్నట్టు అర్థమవుతోంది