తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి, బిఆర్ఎస్ లీడర్ కెటీఆర్ను విమర్శించే క్రమంలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించి, వారి వ్యక్తిగత జీవితాలపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వ్యక్తిగత జీవితాలపై మంత్రి వాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తున్నారు.
నటీనటుల ప్రతిష్టని మంటగలిపేలా వున్న మంత్రి వాఖ్యలపై ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ఇటివల నాగచైతన్య పెళ్లి పై వేణు స్వామి చేసిన వాఖ్యాలని ‘మా’ తీవ్రంగా తప్పుపట్టింది. అద్యక్షుడు మంచు విష్ణు నటీనటులు వ్యక్తిగత విషయాలు జోలికి వస్తే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ అంతకంటే సీరియస్ మేటర్. నాగచైతన్య, నాగార్జున, సమంత వీళ్ళంతా మామూలు ఆర్టిస్ట్స్ కాదు. ఈ స్థాయి వారిపైనే ఇంత జుగుప్సకరమైన వాఖ్యలు చేయడం నటీనటుల జీవితాలపై చులకన భావానికి అద్దం పడుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ విషయంలో కఠిన చర్యల తీసుకునేలా చొరవ తీసుకోవాలి. సినీ పెద్దలతో పాటు పరిశ్రమ అంతా కూడా ఇలాంటి నీచమైన మాటలని ముక్తకంఠంతో ఖండించాల్సిన తరుణమిది.