తెలుగుదేశం పార్టీలో చేరాలని మహాసేన రాజేష్ నిర్ణయించుకున్నారు. దళిత వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపును.. తెచ్చుకున్నారు రాజేష్, గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ ఎన్నికలయిన తర్వాత వైసీపీకి వ్యతిరేకమయ్యారు. వ్యతిరేకంగా మారిన వారిపై ప్రభుత్వం ఎలా వేధిస్తుందో… ఆయన కూడా అనుభవించారు. ఆయనపై ఎన్నో కేసులు పెట్టారు. చాలా సార్లు అర్థరాత్రుళ్లు స్టేషన్ కు తీసుకెళ్లారు. అయినా మహాసేన రాజేష్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
మంచి విషయం పరిజ్ఞానం ఉన్న రాజేష్.. మహాసేన మీడియా పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలను ఎండ గడుతున్నారు. ఇటీవల ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు. టీడీపీలో ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది. సోషల్ మీడియాను సమర్థంగా డీల్ చేయడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు కనబరుస్తారు. ఆయనకు గోదావరి జిల్లాల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కూడా టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది.
వైసీపీ ప్రభుత్వంపై దళిత వర్గాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న అభిప్రాయంతో ఉన్నారు. మహాసేన రాజేష్ వారిని ఏకతాటిపైకి తేవడంలో టీడీపీకి ఉపయోగపడతారని భావిస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు, అచ్చెన్నతో ఆయన సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.