సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. సోమవారం రావాలని ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఈడీ సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో సాయి సూర్య డెవలపర్స్ సంస్థ మహేష్ బాబుకు రూ.5 కోట్ల 90 లక్షలు చెల్లించినట్లుగా గుర్తించారు. అందులో రెండున్నర కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు. ఇది మనీలాండరింగ్ కిందకు వస్తుంది.
ఈ అంశంపై ప్రశ్నించడానికి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడింది. ఒక్క స్థలాన్ని.. ఒక్క ఫ్లాట్ ను పదే పదే అమ్మింది. పలువురు నుంచి డబ్బులు వసూలు చేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో మహేష్ బాబు పాత్రేమీ లేదు. అయితే ఎండార్స్మెంట్ వల్లనే సమస్యలు వచ్చాయి.
తాను తీసుకున్న మొత్తం లీగలేనని… నగదు రూపంలో తీసుకున్న రెండున్నర కోట్ల రూపాయలు కూడా లెక్కల్లో ఉన్నాయని మహేష్ బాబు ఆడిటర్లు చూపిస్తే.. మొత్తం క్లియర్ అయిపోతుంది. సాయి సూర్య కంపెనీ చూపించకపోయినా మహేష్ బాబు తాను ఆ మొత్తానికి పన్ను కట్టానని చూపిస్తే.. సమస్య ఉండదని చెబుతున్నారు. నేరుగా వ్యక్తిగతంగా చేసిన ఎండార్స్ మెంట్ కావడంతో మహేష్ బాబునే తన లాయర్లతో అయినా కలిసి ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది.