బ్రహ్మోత్సవం పరాభవం నుంచి మహేష్ బాబు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. పీపీవీ సంస్థ అయితే… ఇంకా ఆ దెబ్బ నుంచి తేరుకోలేదు. అయితే ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటున్నారు ప్రసాద్ వి.పొట్లూరి. నిజానికి బ్రహ్మోత్సవం సమయంలోనే పీవీపీ సంస్థలో మహేష్ బాబు మరో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. వంశీ పైడిపల్లి మహేష్ కోసం ఓ కథ సిద్దం చేశాడని, 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పుకొన్నారు. బ్రహ్మోత్సవం ఎప్పుడైతే డిజాస్టర్ అయ్యిందో.. పీవీపీకి దూరమైపోయాడు మహేష్. వంశీ పైడిపల్లి ఓ కథ మహేష్ కోసం రెడీ చేసిన విషయం వాస్తవమే అయినా… దాన్ని కనీసం మహేష్ వినలేదు కూడా. అయినా సరే… ‘మా బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది’ అని గట్టి గా చెప్పడం ఆశ్చర్యం కలిగించేదే. నిజానికి మహేష్ కాల్షీట్లు ఏమాత్రం ఖాళీ లేవు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే.. త్రివిక్రమ్‌తో సినిమా పట్టాలెక్కేస్తుంది. ఆ తరవాత ఇక్రమ్ కె. కుమార్ లైన్లోకి వస్తాడు. ఈ సినిమాలు పూర్తయ్యే సరికి కనీసం మరో మూడేళ్లయిన పడుతుంది. ఈలోగా టాలీవుడ్లో ఎన్ని మార్పులు, చేర్పులూ చోటు చేసుకొంటాయో చెప్పలేం. ఊపిరి తరాత మరో సినిమాని పట్టాలెక్కించలేకపోయాడు వంశీ పైడిపల్లి. కథలు తయారు చేసుకోవడంలో విపరీతమైన సమయం తీసుకోవడమే అందుకు కారణం. ఇంత ‘స్పీడు’ డున్న వంశీ.. మహేష్‌తో సినిమా చేయడం అంత తేలికేం కాదు. అందుకే… పట్టాలెక్కేంత వరకూ ఈ కాంబినేషన్‌ని నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు.