దసరా కానుకగా ‘విశ్వంభర’ టీజర్ విడుదల చేశారు. టీజర్లో చిరు లుక్… మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ చీప్‌గా ఉన్నాయని, చుట్టేసిన ఫీలింగ్ కలుగుతోందని, ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే ఈ ఎఫెక్ట్ సరిపోదని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది. లాప్‌టాప్‌లలో, సెల్ ఫోన్లలో చూస్తే ఓకే గానీ, పెద్ద తెరపై టీజర్ చూస్తే, చాలా స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. కొందరైతే హాలీవుడ్ సినిమాల విజువల్స్ ని కాపీ కొట్టారంటూ, సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు.
నిజానికి వీఎఫ్ఎక్స్ పై చిత్రబృందం ఎక్కువ సమయమే కేటాయించింది. భారీగా ఖర్చు పెట్టింది. అయినా ఫలితం కనిపించలేదు. కాకపోతే… విశ్వంభర టీమ్ ముందు తగిన సమయం ఉంది. ఈ విజువల్స్ పై రీ వర్క్ చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు వేసవికి షిఫ్ట్ అయ్యింది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. కాబట్టి చేతిలో తగిన సమయం ఉంది. వీఎఫ్ఎక్స్ ని మార్చి, కొంత క్వాలిటీ తీసుకొచ్చేలా చిత్రబృందం ప్రయత్నించొచ్చు. ‘ఆదిపురుష్’ విషయంలో ఇదే జరిగింది. టీజర్ చూసి అంతా మొహాలు తేలేశారు. టీజర్‌కి వచ్చిన స్పందన చూసిన చిత్రబృందం.. దిద్దుబాటు చర్యలు తీసుకొంది. వీఎఫ్ఎక్స్ లో కొన్ని షాట్స్ మార్చింది. ఇప్పుడు ‘విశ్వంభర’కూ ఆ ఛాన్స్ వుంది. సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో క్వాలిటీ విషయంలో రాజీ పడితే మొదటికే మోసం వస్తుంది. దర్శక నిర్మాతలు ఈ విషయంపై కాస్త సీరియస్ గా ఫోకస్ పెడితే మంచిది.