`మా` ఎన్నికలెప్పుడో తెలిసిపోయింది. ఇక… బలాబలాలను సమీకరించుకోవడమే మిగిలింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే… మా హడావుడి మొదలైపోయింది. ఇప్పుడు మరింత జోరందుకుంది. బరిలో ఎంత మంది ఉన్నా, పోటీ మాత్రం విష్ణు, ప్రకాష్ రాజ్ లమధ్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రకాష్ రాజ్ వెనుక `మెగా` హస్తం ఉంది. తనో విజన్ తో `మా` ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. విష్ణు కీ కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. `మా` భవన నిర్మాణానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పి `మా` సభ్యుల మనసుల్ని గెలుచుకున్నాడు విష్ణు. మరోవైపు భవన నిర్మాణానికి అనువైన స్థలాన్నీ గాలిస్తున్నాడు. ఆ స్థలం కూడా తానే కొనేసి.. అక్కడో బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలన్న ప్లాన్ విష్ణుది. `మా` భవనం కట్టి ఇస్తే గనుక… విష్ణు పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. మా ఎన్నికలకు ముందే ఆ స్థలం కూడా సేకరించి పెట్టేయాలన్నది విష్ణు ఆలోచన. అదే జరిగితే ఈసారి ఎన్నికలలో విష్ణు గెలవడం నల్లేరుపై నడకే.
మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా విష్ణు వెనుకే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ – నరేష్ మధ్య ఓరకమైన గ్యాప్ ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకాష్‌రాజ్ గెలవకూడదన్నది నరేష్ పంతం. ఆ స్థానంలో ఎవరు గెలిచినా ఓకే. అందుకే నరేష్ సపోర్ట్ విష్ణుకే వెళ్లింది. నరేష్ కి `మా`లో కొంత బలం ఉంది. దాదాపు 150 మంది సభ్యులు నరేష్ వెంట ఉన్నారని ఓ అంచనా. నరేష్ పదవిలోకి రాగానే… వృద్ధాప్య పెన్షన్ ని భారీగా పెంచి.. రూ.10 వేలుగా మార్చాడు. కొంతమందికి ప్రతీ నెలా తన జేబులోంచి డబ్బుల్ని తీసి పంపుతున్నాడు. వీళ్లంతా నరేష్ ఎవరికి ఓటు వేయమంటే వాళ్లకు వేస్తారు. సో…. ఈ ఓట్లన్నీ విష్ణుకి పడే ఛాన్సుంది. మాలో ఉన్న ఓట్లు 800 మాత్రమే. అందులో 150 ఓట్లు ఓ వైపు పడిపోతుంటే.. విష్ణు గెలవడం మరింత ఈజీ అవుతుంది.