పట్టుమని వెయ్యి ఓట్లు కూడా లేని `మా` ఎన్నికల వ్యవహారం – ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈసారి `మా` అధ్యక్షుడు ఎవరు? అనే విషయంలో సాధారణ ప్రజానికం కూడా దృష్టి పెట్టింది. కారణం.. ఇది సిని స్టార్లతో ముడి పడిన వ్యవహారం అవ్వడమే. ఇది వరకు `మా` ఎన్నికలు లోపాయికారీగా జరిగిపోయేవి. అధ్యక్షుడు ఎవరో, ప్యానల్ లో ఎవరెవరున్నారో.. ఎవ్వరికీ తెలిసేసేది కాదు. ఇప్పుడు ఏకంగా 5గురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడడంతో `మా` రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
అయితే.. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి పెద్దలు ఈసారి `మా` ఎన్నికల పేరిట ఎలాంటి రభస కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు లేకుండా, ఏకగ్రీవంగా అధ్యక్షుడ్ని ఎంచుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి ప్రకాష్‌రాజ్, విష్ణుల మధ్యనే ప్రధానమైన పోటీ సాగబోతోంది. వీరిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది. ఆ ప్రయత్నాలు సైతం మొదలెట్టినట్టు టాక్. మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయినా సరే, ఈలోగానే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. మురళీమోహన్ సైతం `ఈసారి అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగానే ఎంచుకోవాలని చూస్తున్నాం. ఆ దిశగా చిరంజీవి సైతం ముందుకొచ్చి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు` అని ఓ ముఖాముఖి కార్యక్రమంలో మనసులోని మాట బయటపడడంతో.. ఏకగ్రీవానికి ఇంకా అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తున్నాయి.
అందులోభాగంగా సినిమా పెద్దల దగ్గర ఓ మంచి ఆప్షన్ చుంది. అదేంటంటే.. ఈసారి… ప్రకాష్‌రాజ్ ని ఏకగ్రీవంగా నిలబెట్టి, వచ్చేసారి విష్ణుకి ఛాన్స్ ఇవ్వడం. నిజంగా ఇది మంచి ఆప్షనే. ఎందుకంటే.. అనుభవంతో పోలిస్తే విష్ణు కంటే ప్రకాష్ రాజ్ ముందుంటాడు. పెద్దలకు ముందు ఛాన్స్ ఇవ్వడం కనీసమైన కర్టసీ. ఈ డీల్ విష్ణుకి ఓకే అయితే – మా ఎన్నికలు ఈసారే కాదు. వచ్చే దఫా కూడా ఏకగ్రీవంగానే సాగుతాయి. అయితే నరేష్ వర్గం.. అందుకు ఒప్పుకుంటుందా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఈసారి మా పీఠం మహిళకు దక్కాలని గతంలో ఓసారి అనుకున్నారు. ఆలెక్కన జీవిత కు ఆ ఛాన్స్ రావాలి. ఈసారి జీవితకు అవకాశం ఇచ్చి, వచ్చే ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ని మా అధ్యక్షుడిని చేయమని అడగొచ్చు. అంటే.. విష్ణు మరో నాలుగేళ్లు ఆగాలి. నరేష్ కి `మా`లో ఓటు బ్యాంకు గట్టిగా ఉంది. కాబట్టి నరేష్ మాటకు సినీ పెద్దలు విలువ ఇస్తారు కూడా. విష్ణుని ఒప్పించినట్టే, నరేష్నీ చిరు వర్గం ఒప్పిస్తే… ఈసారి `మా`లో ఎన్నికలంటూ ఉండవు. అయితే.. ఇదంతా జరగడం అంత సులభమైతే కాదు.