“మంత్రి” డెలవపర్స్ యజమానిని ఈడీ అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్‌లోనూ కలకలం రేపుతోంది. జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలోనే ఈ అరెస్ట్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన భూమిని మంత్రి డెవలపర్స్‌కు ప్రభుత్వం కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన సూట్ కేసు కంపెనీల పేరుతో బెంగుళూరులో ఉన్న మంత్రి మాల్‌ను రాసిచ్చారు. ఇదంతా క్విడ్ ప్రో కో వ్యవహారం అన్న ఆరోపణలు వచ్చాయి.
ఆ కేసులోనే పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌తో పాటు చాలా లొసుగులు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విషయంలో ఈడీ విచారణ జరుపుతోంది. జగన్ కేసుల్లో మంత్రి డెవలపర్స్ 25వ ముద్దాయిగా ఉన్నారు. 2002లోనే మంత్రి డెవలపర్స్‌పై ఈడీ కేసు నమోదు చేయగా… శనివారం ఆ సంస్థ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మంత్రి సంస్థ యజమానిని అరెస్ట్ చేయడానికి అదొక్కటే కారణం కాదని ఇంకా చాలా లొసుగులు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో మంత్రి మాల్‌ను జగన్ కంపెనీల పేరిట రాశారని విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత కేసులు నత్త నడకన సాగుతున్నాయి. ఎప్పుడో ఓ సారి నోటీసులు.. విచారణ అంటూ సాగుతోంది. కానీ అసలు నిజాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఈ కేసులపై విచారణ జరుగుతుందో కానీ నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడల్లా.. ఆ నేరం మాత్రం మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది.