రియల్ఎస్టేట్ పడిపోయిందని అది రేవంత్ రెడ్డి చేతకానితనమేనని తాము ఉంటే రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టేదని కేటీఆర్ ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపారులు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. మరి సామాన్యులకు ఎలా మేలు జరుగుతుంది ? అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నఇళ్ల ధరల వల్ల నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారికి కూడా సొంత ఇల్లు అనేది ఓ కలగా మారిపోతోంది. ఇక యాభై వేలు సంపాదించుకునేవారు తమ జీవితంలో సొంత ఇంటిని కొనలేరు.
ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందో.. కరెక్షన్ వచ్చిందో కానీ కొన్ని చోట్ల సామాన్యులకు అందుబాటులో అపార్టుమెంట్స్ దొరికుతున్నాయి. వాటి గురించి ఎంక్వయిరీలు పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ దానికి మంచీ చెడు ఉన్నట్లే రియల్ ఎస్టేట్ భూమ్ కు అడ్డుకట్ట పడటం కూడా ఒకందుకు మంచిదే అని ఇలాంటి పరిస్థితులు నిరూపిస్తున్నాయి.
మెట్రో విస్తరణను ఆపేయడం, ఫార్మాసిటీకి బదులు ఫ్యూచర్ సిటీ అని ప్రయత్నాలు చేయడం, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. వరంగల్లో హైడ్రా లేదుకదా అక్కడెందుకు రియల్ ఎస్టేట్ పెరగలేదని ఆయన ప్రశ్నించారు. నిజానికి దేశవ్యాప్తంగా ఇళ్ల మార్కెట్ స్లంప్లోనే ఉంది. అయితే కాస్త ఎక్కువగా హైదరాబాద్లో ఉంది. ఇది కరెక్షన్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ప్రభుత్వ వైఫల్యంగా మార్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.